Kurnool District: కర్నూలు జిల్లాలో విషాదం.. పాఠశాలలో సాంబారు గిన్నెలో పడి యూకేజీ విద్యార్థి మృతి

  • విజయానికేతన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఘటన
  • మధ్యాహ్న భోజనం కోసం క్యూలో నిల్చున్న విద్యార్థి
  • వెనక నుంచి నెట్టివేయడంతో సాంబారు గిన్నెలో పడిన వైనం

కర్నూలు జిల్లా పాణ్యంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాలలో వేడివేడి సాంబారు పాత్రలో పడి యూకేజీ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఓర్వకల్లు మండలం తిప్పాయిపల్లెకు చెందిన శ్యాంసుందర్‌రెడ్డి, కల్పన దంపతుల కుమారుడు పురుషోత్తంరెడ్డి (6) పాణ్యంలోని విజయానికేతన్ రెసిడెన్షియల్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. రోజూలాగానే నిన్న మధ్యాహ్నం పురుషోత్తం భోజనం కోసం క్యూలో నిల్చున్నాడు. ఈ క్రమంలో వెనకున్న విద్యార్థులు నెట్టివేయడంతో అదుపుతప్పిన చిన్నారి పురుషోత్తం ముందున్న పొగలు కక్కుతున్న సాంబారు గిన్నెలో పడిపోయాడు.

వెంటనే అప్రమత్తమైన స్కూలు యాజమాన్యం చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించింది. అయితే, అప్పటికే విద్యార్థి శరీరంపై బొబ్బలు రావడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనకు నిరసనగా విద్యార్థి సంఘాలు నిన్న రాత్రి పాఠశాల వద్ద ఆందోళనకు దిగాయి. పాఠశాల యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.

More Telugu News