Andhra Pradesh: స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం: వైసీపీ ఎమ్మెల్యే మల్లాది

  • స్పీకర్ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడుతున్నారు 
  • సభాహక్కుల ఉల్లంఘన చర్యలకు నిర్ణయం
  • రాజకీయాల్లో లంబూజంబూలు టీడీపీ, ‘జనసేన’

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్పీకర్ వ్యవస్థను కించపరిచేలా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ నేతలు ఎవరైతే స్పీకర్ ను దూషించారో, అగౌరవపరిచారో వారిపై సభాహక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు చెప్పారు.

చంద్రబాబువి దొంగ దీక్షలు, కొంగ జపాలు 

ప్రకృతి వైపరీత్యాల కారణంగా రాష్ట్రంలో ఏర్పడ్డ ఇసుక కొరతపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మల్లాది విష్ణు విమర్శించారు. ఇసుక కొరతపై దుష్ప్రచారం చేసేందుకే చంద్రబాబు రేపు నిరాహారదీక్షకు దిగుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేసేవి దొంగ దీక్షలు, కొంగ జపాలు అని ధ్వజమెత్తారు. ఇసుక మాఫియాలను పెంచిపోషించింది చంద్రబాబు హయాంలోనే అని, బాబు ఐదేళ్ల పాలనలో దోపిడీ చేశారని ఆరోపించారు. మానవ తప్పిదం కారణంగానే ఇసుక కొరత ఏర్పడిందని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన పార్టీలపై ఆయన విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో లంబూజంబూలు టీడీపీ, ‘జనసేన’ అని విమర్శించారు.

More Telugu News