Telangana: తెలంగాణ ప్రభుత్వానికి కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా?: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

  • హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా ఫలితం లేదు!
  • ఒకవైపు రైతులు, మరోవైపు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు
  • ఎన్జీవో ఉద్యోగ సంఘాల నాయకులు చెంచాగిరి చేస్తున్నారు

తెలంగాణలో నలభై రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయమై ప్రభుత్వం స్పందించకపోవడంపై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోమారు మండిపడ్డారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఇన్నిరోజుల పాటు జరగడం ఇదే మొదటిసారని అన్నారు. ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకడం లేదంటూ కేసీఆర్ సర్కారుపై ధ్వజమెత్తారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆత్మహత్యలు ఉండవని నాడు కేసీఆర్ పలు సందర్భాల్లో మాట్లాడారని, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని విమర్శించారు. ఒకవైపు రైతులు, మరోవైపు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వానికి కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ఎన్జీవో ఉద్యోగ సంఘాల నాయకులపైనా విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ మాటలను ఎన్జీవో ఉద్యోగ సంఘాల నాయకులు బలపరుస్తున్నారే తప్ప, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై మాట్లాడటం లేదని, ప్రభుత్వానికి చెంచాగిరి చేస్తున్నారని ఆరోపించారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News