నెగెటివ్ రోల్స్ చేయాలని వుంది: హీరోయిన్ హన్సిక

13-11-2019 Wed 15:04
  • ఇంతవరకూ 50కి పైగా సినిమాలు చేశాను
  • విభిన్నమైన పాత్రలతో మెప్పించాను 
  • ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నానన్న హన్సిక

తెలుగు .. తమిళ భాషల్లో గ్లామరస్ హీరోయిన్ గా హన్సికకి మంచి క్రేజ్ వుంది. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ వెళుతున్న హన్సిక, తెలుగులో మాత్రం అడపా దడపా మాత్రమే నటిస్తోంది. ఆమె తాజా చిత్రంగా 'తెనాలి రామకృష్ణ బీఏబీ ఎల్' ఎల్లుండి ప్రేక్షకుల ముందుకురానుంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .."దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డిగారితో గతంలో 'దేనికైనా రెడీ' చేశాను. ఆయనతో కలిసి నేను చేస్తున్న రెండవ సినిమా ఇది. ఈ సినిమాలో నా పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇంతవరకూ 50 చిత్రాలకి పైగా చేశాను. విభిన్నమైన పాత్రల ద్వారా ప్రేక్షకులను మెప్పించాను. అయితే పూర్తి స్థాయిలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో చేయాలని వుంది. అలాంటి పాత్ర కోసమే చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో హన్సిక ముచ్చట ఎప్పుడు తీరుతుందో చూడాలి మరి.