Chandrababu: ఏపీ అభివృద్ధికి ఇది ఊహించని శరాఘాతం: చంద్రబాబు ఆగ్రహం

  • సింగపూర్ కన్సార్టియంతో ఎంవోయూ రద్దు చేశారు
  • భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేపడుతున్నాను
  • ఇంతమంది కార్మికుల ఆత్మహత్యలు రాష్ట్రచరిత్రలోనే ఎన్నడూ లేవు

ఏపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. సింగపూర్ కన్సార్టియంతో ఎంవోయూ రద్దు చేశారని, ఏపీ అభివృద్ధికి ఇది ఊహించని శరాఘాతమని అన్నారు. ఇసుక సమస్యపై రేపు దీక్ష చేపట్టనున్న నేపథ్యంలో ఆయన ఈ రోజు తమ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేపడుతున్నానని అన్నారు. ఐదు నెలల్లో 50 మంది కార్మికుల ఆత్మహత్యలు రాష్ట్రచరిత్రలోనే ఎన్నడూ లేవని విమర్శించారు.

ఇసుక కృత్రిమ కొరతను వైసీపీ నేతలే సృష్టించారని చంద్రబాబు అన్నారు.  రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని, పోలవరం ప్రాజెక్టు పనులను కూడా నిలిపివేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుతో ఏపీకి తీరని నష్టమని, రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుతున్నారని అన్నారు. ఇష్టానుసారం  నిరంకుశ ధోరణితో ప్రవర్తిస్తున్నారని , ప్రజా కంటక పార్టీగా వైసీపీ మారిందని చెప్పారు. ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి పోరాడతామని అన్నారు.

More Telugu News