Yediyurappa: అనర్హత ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అంశంపై యడియూరప్ప స్పందన

  • సాయంత్రం వరకు వేచి చూడండి
  • వారితో పాటు, హైకమాండ్ తో చర్చిస్తా
  • సాయంత్రంలోగా సముచిత నిర్ణయం తీసుకుంటాం

కర్ణాటకలో 17 మంది అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేల పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్ కు ఉంటుందని... అయితే, రానున్న ఉపఎన్నికల్లో వారు పోటీ చేయవచ్చని తెలిపింది.

ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ, 17 మంది అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు ఉపఎన్నికల్లో పోటీ చేయవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. ఉపఎన్నికలు జరగనున్న అన్ని నియోజకవర్గాల్లో రేపటి నుంచి తాము పర్యటిస్తామని తెలిపారు. ఈ 17 స్థానాలను బీజేపీ నూటికి నూటొక్క శాతం గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోబోతున్నారా? అనే ప్రశ్రకు సమాధానంగా... సాయంత్రం వరకు వేచి చూడండని యడియూరప్ప చెప్పారు. తమ హైకమాండ్ తో పాటు, అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలతో తాను చర్చిస్తానని తెలిపారు. సాయంత్రంలోగా ఒక సముచిత నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పారు.

More Telugu News