shiv sena: అందుకే మహారాష్ట్రలో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి: శివసేన

  • బీజేపీపై మరోసారి విమర్శలు
  • బీజేపీ-శివసేనకు అనుకూలంగా రాష్ట్ర ప్రజలు  తీర్పు ఇచ్చారు
  • ఇచ్చిన మాటకు బీజేపీ కట్టుబడి లేదు
  • వ్యవస్థను దుర్వినియోగం చేస్తోంది

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన విషయంలో బీజేపీపై శివసేన మరోసారి విమర్శలు గుప్పించింది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసేన తమ పార్టీ పత్రిక సామ్నాలో ఓ కథనం రాసుకొచ్చింది. 'ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమికి అనుకూలంగా రాష్ట్ర ప్రజలు  తీర్పు ఇచ్చారు. ఇరు పార్టీలు కలిసి పోటీ చేసినందుకే ఇటువంటి తీర్పు ఇచ్చారు. అయితే, ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును అంగీకరించేందుకు బీజేపీ సిద్ధంగా లేదు.. అందుకే మేము ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మహారాష్ట్ర గొప్పదనాన్ని నిలబెట్టుకోవడానికే ఇలా చేశాం'  అని పేర్కొంది.

'ఈ విషయంలో మమ్మల్ని నిందించాల్సిన అవసరం ఏముంది? నైతిక విలువలు, సంప్రదాయాలకు బీజేపీ కట్టుబడి ఉంటుందని అంటారు. మరి ఇప్పుడు మహారాష్ట్రలో అవే అంశాలకు కట్టుబడి ఉండి, వాటిని పాటించాల్సింది. ఒకవేళ బీజేపీ తాము ఇచ్చిన హామీపై నిలబడి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు' అని శివసేన తెలిపింది.

కాగా, ఎన్నికలకు ముందే 50-50 ఫార్ములాకు బీజేపీ అంగీకరించిందని శివసేన అంటోన్న విషయం తెలిసిందే. తమ పార్టీ ప్రాభవాన్ని తగ్గించడానికే బీజేపీ కుట్ర పన్నిందని శివసేన ఆరోపించింది. ప్రస్తుతం చాలా మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్రలో లేరని, వారి మద్దతు కూడగడుతూ 24 గంటల్లో సంతకాలు తీసుకొస్తామని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి తాము చెప్పామని శివసేన పేర్కొంది. అయినప్పటికీ గవర్నర్ ఒప్పుకోలేదని, ఇది వ్యవస్థను దుర్వినియోగం చేయడమే అవుతుందని విమర్శించింది.

More Telugu News