Police: బైకర్ ను లిఫ్ట్ అడిగి, ఆపై తన ఆటో బ్యాచ్ తో దోపిడీ... పోలీసుల అదుపులో ముఠా!

  • జడ్చర్ల కేంద్రంగా దోపిడీ ముఠా ఆగడాలు
  • పలు ఫిర్యాదులను అందుకున్న పోలీసులు
  • తనిఖీలు చేస్తుండగా పట్టుబడిన నిందితులు

రోడ్డు మీద ఒంటరిగా బైక్ పై వెళుతున్న వారే వారి టార్గెట్. తొలుత లిఫ్ట్ అడుగుతారు. ఆపై ఎక్కించుకున్న తరువాత వారిని ఓ ఆటో ఫాలో అవుతుంది. కాసేపటి తరువాత, బైక్ ను ఆపించగానే, ఆటోలో ఉన్న వారు వచ్చి, దోపిడీకి దిగి, లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి దగ్గరి డబ్బు, సెల్ ఫోన్, బైక్ నుంచి సమస్తమూ దోచేసుకుని పారిపోతారు. ఈ దోపిడీ ముఠాపై పలు ఫిర్యాదులను అందుకున్న పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, తెలంగాణలోని జడ్చర్ల సమీపంలో ఈ నెల 10వ తేదీన బూర్గపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రాములు అనే వ్యక్తి తన బైక్ పై వస్తుండగా, నాగసాల గ్రామంలో ఓ వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. ఒంటరిగా ఉన్నాడన్న కారణంతో బైక్ ను ఆపి ఎక్కించుకోగా, కాసేపటికి బైక్ ను ఆపించి, అతని వద్ద ఉన్న రూ. 1,800 నగదు, సెల్ ఫోన్ తీసుకుని పరారు అయ్యారు. బాధితుడు జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఈ క్రమంలో నిన్న నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా కొంతమంది యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. అఖిల్‌ కృష్ణ, అంకం భాస్కర్, పాస్టం కల్యాణ్, రాపల్లె చంద్రుడు, వడిత్యావత్‌ శివ, శివగళ్ల రాజ్‌ కుమార్, నాయిడు దుర్గా రాజ్‌కుమార్‌ లను పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుల నుంచి మూడు బైక్ లు, ఓ ఆటో, మొబైల్ ఫోన్, నగదును స్వాధీనం చేసుకుని, వారిని రిమాండ్ కు తరలించారు. నిందితులంతా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారేనని, ఉపాధినిమిత్తం జడ్చర్ల ప్రాంతానికి వచ్చి టిఫిన్ సెంటర్లలో పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

More Telugu News