KCR: దీని వెనుక చాలా మతలబే ఉందనుకుంటాను: కేసీఆర్ పై విజయశాంతి విమర్శలు

  • అయోధ్య తీర్పుపై స్పందించని కేసీఆర్
  • తప్పించుకోవడం వెనుక ఎంఐఎం ప్రాపకం కోసం ప్రయత్నం
  • దొరగారి అసలు నైజం ఇదేనన్న విజయశాంతి

అయోధ్యలోని రామాలయంపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తరువాత, ఇంతవరకూ స్పందించని కేసీఆర్ టార్గెట్ గా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి విమర్శలు గుప్పించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.

"తెలంగాణ సీఎం కేసీఆర్ అయోధ్యలో రామ జన్మభూమికి సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించకుండా, తప్పించుకోవడం వెనక చాలా మతలబే ఉన్నట్లు స్పష్టమవుతోంది. దేశమంతా రామమందిరం నిర్మాణానికి సంబంధించి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉంటే... తెలంగాణ సీఎం దొరగారు మాత్రం సెక్యూలరిజం పేరుతో... ఎంఐఎం ప్రాపకం కోసం సుప్రీం తీర్పుపై సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

 పైకి తాను అసలైన హిందువు అని చెప్పుకునే కేసీఆర్ గారికి.. లోలోపల రామమందిరం నిర్మాణం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో గతంలో ఆయన చేసిన కామెంట్‌ను చూస్తే అర్థమవుతుంది. రామమందిరం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని... అయోధ్య అంశాన్ని తోకతో పోలుస్తూ గతంలో కెసిఆర్ గారు విమర్శించడం దొరగారి అహంకారానికి నిదర్శనం. ఇంతకు ముందు తన మనసులోని మాటను బయటపెట్టిన కెసిఆర్ గారు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు రామాలయ నిర్మాణానికి అనుకూలంగా ఉండటంతో జీర్ణించుకోలేకపోతున్నారేమో? దీన్నే కుహనా లౌకిక వాదం అంటారు... గతంలో కెసిఆర్ గారు రామమందిరం పై ఏమన్నారో, ఆ వీడియో చూస్తే, దొరగారి అసలు నైజం అర్థమవుతుంది" అని విజయశాంతి వ్యాఖ్యానించారు.

More Telugu News