Telugudesam: పార్టీ ఫండ్ దుర్వినియోగం ఆరోపణలపై.. స్టాలిన్ బాబుపై వేటువేసిన తెలుగుదేశం!

  • పి.గన్నవరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన స్టాలిన్ బాబు
  • అప్పట్లో పార్టీ ఫండ్ ను దుర్వినియోగం చేశారని ఆరోపణలు
  • సస్పెండ్ చేసిన నియోజకవర్గ కమిటీ, జిల్లా అధ్యక్షుడి ఆమోదం

గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన నేలపూడి స్టాలిన్‌ బాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు తెలుగుదేశం ప్రకటించింది. ఎన్నికల సమయంలో అధిష్ఠానం నుంచి వచ్చిన ఫండ్ ను దుర్వినియోగపరిచారని ఆయనపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై గత నాలుగైదు నెలలుగా స్టాలిన్ బాబు విమర్శలను ఎదుర్కొంటూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో నియోజకవర్గ కార్యకర్తల స్థాయి సమావేశం జరుగగా, గతంలో ఎన్నడూ జరగని రీతిలో పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన వ్యక్తినే ఆ పార్టీ కేడర్‌ బహిష్కరిస్తున్నట్టు తీర్మానించింది. ఆ వెంటనే జిల్లా అధ్యక్షుడికి తీర్మానం పంపడం, దానికి ఆమోదముద్ర పడటం జరిగిపోయింది.

 అంబాజీపేటకు చెందిన నేలపూడి స్టాలిన్‌ బాబు గతంలో అప్పటి టీడీపీ ఎంపీ పండుల రవీంద్రబాబు వద్ద పీఆర్వోగా పనిచేసేవారు. ఎన్నికల తరువాత ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. తనపై వేటు పడుతుందన్న అనుమానంతో, రెండు రోజుల క్రితం తానే టీడీపీకి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు కూడా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీలో ఉన్న నమ్మక ద్రోహుల వల్లే తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News