sabarimala temple: శబరిమలలో ప్రారంభం కానున్న పూజలు.. 10 వేల మందితో భారీ భద్రత

  • ఈ నెల 15 నుంచి పూజలు ప్రారంభం
  • తొలి దశ వేడుకకు 2,551 మంది
  • రెండో దశలో 2,539 మందితో భద్రత

ఈ నెల 15 నుంచి శబరిమల అయ్యప్ప ఆలయంలో పూజలు ప్రారంభం కానుండడంతో భారీ భద్రత ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు 10,017 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఈ నెల 15 నుంచి 30 వరకు జరిగే తొలి దశ వేడుకకు సన్నిధానం, పంబ, నిలక్కల్, ఎరుమెలి వద్ద 2,551 మంది, 30 నుంచి వచ్చే నెల 14 వరకు జరిగే రెండో దశ వేడుకకు 2,539 మంది, మూడో దశలో 2,992 మంది, నాలుగో దశలో 3,077 మంది చొప్పున బాధ్యతలు నిర్వర్తించనున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. వీరితోపాటు సన్నిధానం, నిలక్కల్, పంబ వద్ద అదనంగా 1,560 మంది ప్రత్యేక బలగాలను కూడా మోహరించాలని నిర్ణయించారు.

ఆలయం వద్ద చేపట్టే భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు చీఫ్ కోఆర్డినేటర్‌గా ఏడీజీ షేక్ డర్వేష్ సాహెబ్‌ను నియమించారు. మొత్తం 112 మంది డీఎస్పీలు, 264 మంది సీఐలు, 1185 మంది ఎస్సై/ఏఎస్సైల పర్యవేక్షణలో 8,402 మంది సివిల్ పోలీసులు విధులు నిర్వర్తించనున్నారు. వీరిలో 307 మంది మహిళా అధికారులు ఉన్నారు.

More Telugu News