Pawan Kalyan: విజయవాడ నడిబొడ్డున కూర్చుని చెబుతున్నా, ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాను: సీఎం జగన్ పై జనసేనాని ధ్వజం

  • పవన్ మీడియా సమావేశం
  • సీఎం జగన్ పై ఆగ్రహావేశాలు
  • మీలాగా మేం దిగజారి వ్యాఖ్యలు చేయబోమన్న పవన్

ఇంగ్లీషు మీడియం వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ పక్షాల మధ్య మాటలయుద్ధానికి కారణమైంది. అధికార పక్షం వైసీపీతో విపక్షాలు టీడీపీ, జనసేన సై అంటే సై అంటున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తనపై సీఎం జగన్ వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్ పై నిప్పులు చెరిగారు. విజయవాడ నడిబొడ్డున కూర్చుని చెబుతున్నానని, తాను ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.

"జగన్ రెడ్డి గారూ మీరు చాలా చిల్లరగా మాట్లాడుతున్నారు. సీఎం హోదాకు తగ్గట్టు హుందాగా మాట్లాడడం నేర్చుకోండి. ఎన్నికల ప్రచారంలో ఎలాగూ చిల్లరగా మాట్లాడారు. మీ స్థాయి అది. కానీ మేం మీలాగా కాదు, మా తల్లిదండ్రులు సంస్కారం నేర్పించారు. భాషా సంస్కారాలు మర్చిపోయి మీరు ఎంత హీనంగా మాట్లాడినా మేం మా స్థాయికి దిగజారి మాట్లాడం. కచ్చితంగా పాలసీ విధానాలపైనే స్పందిస్తాం తప్ప వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లం" అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా, ఇప్పటికిప్పుడు ఇంగ్లీషు మీడియం అంటే ఎలా అని ప్రశ్నించారు. విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం అమలు చేయాలంటే ముందు టీచర్లను సన్నద్ధం చేయాలని హితవు పలికారు. ఓ ప్రాంతాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకుని ఓ ఆరు నెలల పాటు కొన్ని స్కూళ్లలో ప్రయోగాత్మకంగా అమలు చేసి అప్పుడు సాధ్యాసాధ్యాలపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రాథమిక దశలో ఉన్న విద్యార్థులు అవకతవక నిర్ణయాలతో అటు తెలుగు రాక, ఇటు ఇంగ్లీషు రాక రెంటికి చెడ్డ రేవడిలా మిగిలిపోతారని హెచ్చరించారు.

More Telugu News