Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో 14 నుంచి ఇసుక వారోత్సవాలు: కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి వెల్లడి

  • ఏడురోజుల్లో రోజువారీ సరఫరాను 2 లక్షల టన్నులకు పెంచాలని నిర్ణయం
  • ఇసుక అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
  • రెండురోజుల్లోగా  నియోజకవర్గాల వారీగా రేటు కార్డును నిర్ణయించాలని సూచన

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 14 నుంచి 21వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు 13 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. వరదల కారణంగా రాష్ట్రంలో ఇసుక రీచ్ లు మునిగిపోవడంతో కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. గత వారం రోజుల్లో పరిస్థితి మెరుగుపడిందన్నారు. వినియోగంలోకి వచ్చిన రీచ్ ల సంఖ్య 90కి పెరిగిందన్నారు. అదేవిధంగా ఇసుక సరఫరా 1.2 లక్షల టన్నులకు పెరిగిందని అన్నారు. గతంలో ఇసుక సగటు డిమాండ్ 80వేల టన్నులుగా ఉందని చెప్పారు. వచ్చే ఏడురోజుల్లో రోజువారీ సరఫరాను 2 లక్షల టన్నులకు, ఇసుక స్టాక్ పాయింట్లను 137నుంచి 180కి పెంచాలని జగన్ అధికారులను ఆదేశించారు.

నియోజకవర్గాల వారీగా రేటు కార్డును రెండురోజుల్లోగా నిర్ణయించాలని సూచించారు. రాష్ట్రంలో ఇసుక కొరత తీరేవరకు అధికారులు సెలవు తీసుకోరాదని, అక్రమ ఇసుక రవాణా అరికట్టడానికి సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రేటుకన్నా ఇసుక ఎక్కువ రేటుకు అమ్మితే వారిపై జరిమానా విధించడంతో పాటు, వాహనాలను సీజ్ చేసి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని అదేశించారు. బుధవారం దీనికి సంబంధించి కేబినెట్ ఆమోదం కూడా తీసుకోవాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ అంతా వారం రోజుల్లో పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు.

More Telugu News