NCP: శివసేనకు గడువు ముగియడంతో తాజాగా ఎన్సీపీని ఆహ్వానించిన మహారాష్ట్ర గవర్నర్!

  • మహారాష్ట్రలో తొలగని అనిశ్చితి
  • కాంగ్రెస్ యూటర్న్ తీసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో శివసేన
  • తమను గవర్నర్ పిలిచారంటున్న ఎన్సీపీ నేతలు

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. నిన్న శివసేన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆహ్వానించి, ఈ రోజు సాయంకాలం ఏడున్నర వరకు గడువు ఇచ్చిన సంగతి విదితమే. అయితే, ఆ సమయంలోగా శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో, గవర్నర్ తాజాగా ఎన్సీపీని ఆహ్వానించారు. గవర్నర్ నుంచి తమకు ఆహ్వానం అందిందని ఎన్సీపీ నేత అజిత్ పవార్ వెల్లడించారు. పిలుపు మేరకు గవర్నర్ ను కలిసేందుకు వెళుతున్నామని, అయితే ఆయన ఎందుకు పిలిచారో తమకు తెలియదని పవార్ పేర్కొన్నారు.

కాగా, ప్రభుత్వం ఏర్పాటుపై కొన్ని గంటల ముందు వరకు ఎంతో ధీమాగా ఉన్న శివసేన ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ. తొలుత మద్దతు ఇచ్చేందుకు మొగ్గు చూపిన కాంగ్రెస్ ఆ తర్వాత మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. తాము ఎన్సీపీతో కూడా చర్చించాల్సి ఉందంటూ కాంగ్రెస్ అధినాయకత్వం శివసేనకు నిరాశ కలిగించే సంకేతాలు పంపింది.

More Telugu News