Andhra Pradesh: ఏపీలో ఇసుక కొరతపై చంద్రబాబు బహిరంగ లేఖ

  • రాష్ట్రంలో రగులుతున్న ఇసుక అంశం
  • వైసీపీపై విపక్షాల దాడి
  • ఈ నెల 14న విజయవాడలో చంద్రబాబు దీక్ష

రాష్ట్రంలో ఇసుక అంశం నానాటికీ తీవ్రరూపు దాల్చుతోంది. ఇసుక లేక పనులు ఆగిపోవడంతో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో విపక్షాలు అధికార వైసీపీపై విరుచుకుపడుతున్నాయి. తాజాగా, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇసుక కొరత అంశంపై బహిరంగ లేఖ రాశారు. తమ హయాంలో రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలు చేశామని, దాంతో ఇసుక ధరలు అందరికీ అందుబాటులో కొనసాగాయని వివరించారు. కానీ, జగన్ తెచ్చిన నయా ఇసుక విధానంతో కృత్రిమ కొరత ఏర్పడిందని ఆరోపించారు.

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం పర్యవసానంగా 30 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక కొరతతో భవన నిర్మాణం రంగం కుదేలైందని, ఇప్పటివరకు 40 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని తన లేఖలో వివరించారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించాలని, భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేల భృతి ఇవ్వాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుక కొరతపై ఈ నెల 14న విజయవాడలో దీక్ష చేపడుతున్నానని, 125 వృత్తుల వారు ఈ దీక్షలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

More Telugu News