Ayodhya: అయోధ్య రామమందిరం నిర్మాణం వచ్చే ఏడాది ప్రారంభం!

  • శ్రీరామనవమి సందర్భంగా నిర్మాణ పనులు షురూ!
  • అంతకంటే మంచిరోజు మరేం ఉంటుందన్న వీహెచ్ పీ
  • 1989 నాటి డిజైన్ ఆధారంగా ఆలయ నిర్మాణం!

అయోధ్యలో వివాదాస్పద భూమి హిందువులదేనని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో రామమందిరం నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. అన్నీ సవ్యంగా కుదిరితే వచ్చే ఏడాది రామమందిరం నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. 2020 ఏప్రిల్ నెలలో వచ్చే శ్రీరామనవమి కంటే శుభముహూర్తం మరేం ఉంటుందని హిందుత్వ సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ, ట్రస్ట్ ఏర్పాటుకు విధించిన మూడు నెలల గడువు ఫిబ్రవరితో ముగుస్తుందని, అప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తవుతాయని తెలిపారు. మందిరం నిర్మాణం ప్రారంభ తేదీపై ప్రభుత్వంతో చర్చిస్తామని వెల్లడించారు. రాముడి ఆలయ నిర్మాణాన్ని మొదలుపెట్టేందుకు శ్రీరామనవమి అన్ని విధాలా సరైన రోజు అని భావిస్తున్నామని స్పష్టం చేశారు.

అయితే నిర్మాణ ముందస్తు సన్నాహాలు మకర సంక్రాంతి రోజున ప్రారంభించాలని వీహెచ్ పీ నేతలు తలపోస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, 1989లో ప్రముఖ ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సోమపుర ఇచ్చిన డిజైన్ ఆధారంగా అయోధ్యలో రామమందిరం నిర్మించాలని వీహెచ్ పీ కోరుకుంటోంది.

More Telugu News