Srikakulam District: కడలి అలలు కబళించాయి... సముద్రంలో స్నానానికి దిగిన ఒకరి మృతి.. ముగ్గురు విద్యార్థుల గల్లంతు!

  • శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం తీరంలో ఘటన
  • విహార యాత్రకు వెళ్లిన ఆరుగురు స్నేహితులు
  • ఈతకు దిగిన ఐదుగురిలో ఒకరిని రక్షించిన స్థానికులు

ఆనంద తీరాన్ని అందుకోవాలన్న ఉత్సాహంలో వారు పొంచివున్న ప్రమాదాన్ని ఊహించలేకపోవడంతో నాలుగు కుటుంబాల్లో తీవ్ర  విషాదం చోటు చేసుకుంది. పిక్నిక్‌ కోసం వెళ్లి సముద్ర స్నానానికి దిగిన వారిలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం తీరంలో నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి.

శ్రీకాకుళం పట్టణానికి చెందిన కె.సంజయ్‌, ఎస్‌.శివరామరెడ్డి (ప్రవీణ్‌), వై.నారాయణపండా, ఎ.సుధీర్‌, షేక్‌ అబీబ్‌, లింగా రాజసింహ విహార యాత్రకు కళింగపట్నం తీరానికి వెళ్లారు. రోజంతా సమీపంలోని తోటల్లో ఉత్సాహంగా గడిపిన వారంతా సాయంత్రం సముద్ర స్నానం కోసం ఒడ్డుకువచ్చారు.

వీరిలో రాజసింహ ఒడ్డున కూర్చుని ఉండగా మిగిలిన ఐదుగురు స్నానం కోసం సముద్రంలోకి దిగారు. నీటిలో కేరింతలు కొడుతుండగా ఉవ్వెత్తున ఎగసిపడిన ఓ అల వారిని లోపలికి లాక్కుపోయింది. స్నేహితులు సముద్రంలో మునిగిపోతుండడం గమనించిన రాజసింహ గట్టిగా కేకలు వేయడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న మెరైన్‌ పోలీసులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు.

వీరిలో షేక్‌ అబీబ్‌ను రక్షించగా మిగిలిన వారు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో సుధీర్‌ మృతదేహం లభ్యంకాగా, మిగిలిన వారి ఆచూకీ తెలియాల్సి ఉంది.

More Telugu News