Team India: ఆటగాళ్లు ఇలాగే ఆడుతూ పోతే.. కోహ్లీ, సెలెక్టర్లకు పెద్ద తలనొప్పే: రోహిత్ శర్మ 

  • మూడో టీ20లో విజయానికి బౌలర్లే కారణం
  • బ్యాటింగ్ లో రాహుల్, అయ్యర్ సత్తా చాటారు
  • ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని ఆడాలనే మేము కోరుకుంటున్నాం

నిన్న నాగపూర్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మూడవ టీ20లో భారత్ అద్భత విజయాన్ని సాధించి, సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, ఈ విజయానికి బౌలర్లే కారణమని చెప్పాడు. ఆట మధ్యలో మంచు పడుతున్న సమయంలో బౌలింగ్ చేయడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందేనని అన్నాడు. ఒకానొక సమయంలో ఆట చేజారిపోతోందేమోనని సందేహిస్తున్న సమయంలో, బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారని కితాబిచ్చాడు. తమ జెర్సీలను చూపిస్తూ, దీని కోసమే మనం అడుతున్నామంటూ వారిలో స్ఫూర్తిని నింపానని చెప్పాడు.

రాహుల్, అయ్యర్ బ్యాటింగ్ లో సత్తా చాటారని రోహిత్ ప్రశంసించాడు. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని ఆడాలనే తాము కోరుకుంటున్నామని చెప్పాడు. ప్రపంచకప్ కు మనం దగ్గరవుతున్న కొద్దీ... జట్టులో సరైన సమతుల్యాన్ని మనం సాధించాలని తెలిపాడు. ఈ సిరీస్ కు కొందరు కీలక ఆటగాళ్లు దూరమయ్యారని, త్వరలోనే వారంతా జట్టులోకి వస్తారని తెలిపాడు. ఆస్ట్రేలియా పర్యటకు వెళ్లడానికి ముందే తమ మదిలో కొన్ని గేమ్ ప్లాన్స్ ఉన్నాయని చెప్పాడు. ఆటగాళ్లంతా ఇదే మాదిరి అద్భుత ప్రతిభను కనబరుస్తూ పోతే.. రానున్న రోజుల్లో జట్టు ఎంపిక విషయంలో కెప్టెన్ కోహ్లీతో పాటు సెలెక్టర్లకు పెద్ద తలనొప్పేనని చమత్కరించాడు.

More Telugu News