Narendra Modi: మొన్న, నిన్న, నేడు సక్సెస్... ప్రధాని మోదీ తదుపరి అడుగు ఎటు?

  • మోదీ నెక్ట్స్ టార్గెట్ పీఓకే
  • ఆపై ఉమ్మడి పౌరస్మృతి అమలు
  • అంత ఈజీ కాదంటున్న నిపుణులు

మూడేళ్ల క్రితం పెద్ద నోట్ల రద్దు... ఆపై సర్జికల్ స్ట్రయిక్స్, దాని తరువాత ఆ మధ్య ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు. ఇప్పుడు అయోధ్య... ఇవన్నీ దేశ రాజకీయాలను, భవిష్యత్ గతిని మార్చివేసేవే. స్వతంత్ర భారతావనిలో కాంగ్రెస్ పార్టీ ఇవేమీ చేయలేకపోయింది. కానీ నరేంద్ర మోదీ చేసి చూపించారు. ఇక మోదీ తరువాతి అడుగులు ఎటువైపన్న విషయమై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం నరేంద్ర మోదీ ముందు ఉన్న అంశాలు రెండు. అవే ఉమ్మడి పౌరసత్వం అమలు, పీఓకే. ఈ రెండింటిలో ఆయన ఏది ముందుగా చేపడతారన్న విషయంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

వీటిల్లో మొదటిది పాక్ ఆక్రమిత కశ్మీర్. 1970వ దశకంలో జరిగిన యుద్ధం తరువాత పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న భారత భూభాగం జోలికి ఇండియా వెళ్లలేదు. కానీ, పాకిస్థాన్ మాత్రం ఆ ప్రాంతంలో ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ, వారికి శిక్షణ ఇస్తూ, ఇప్పటికి కూడా ఇండియాపై దాడులకు వారిని ఉసి గొల్పుతూనే ఉంది. ఇదే సమయంలో ఆ ప్రాంత ప్రజల్లో భారత్ తో తాముంటే అభివృద్ధి చెందుతామన్న భావనా ఉంది. అందుకే అక్కడ నిత్యమూ నిరసనలు జరుగుతూనే ఉంటాయి. పాక్ వాటిని అణచివేసే ప్రయత్నాలూ చేస్తోంది.

పీఓకేను ఇండియాలో విలీనం చేసే దిశగా మోదీ సర్కారు అడుగులు వేయడం ప్రారంభించిందని అంటున్నారు నిపుణులు. సమయం దొరికినప్పుడల్లా ఆ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను ఒక్కొక్కటిగా ధ్వంసం చేసుకుంటూ వెళుతున్న భారత్, అంతర్జాతీయ సమాజంలో పాక్ ను ఏకాకిని చేస్తూనే ఉంది. ఎన్నో దేశాలు ఇప్పుడు పాక్ వైఖరిని తప్పుపడుతూ, ఇండియాకు మద్దతుగా నిలుస్తున్నాయి. పీఓకేను తిరిగి భారత్ లో కలుపుకునేందుకు ఇదే సరైన సమయమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు కూడా.

మోదీ ముందున్న మరో టార్గెట్ ఉమ్మడి పౌరసత్వం. దీని అమలు ఇండియాలో సాధ్యమేనా? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. మోదీ ప్రభుత్వం తలచుకుంటే సాధ్యమేనన్న సమాధానాలూ వినిపిస్తున్నాయి. ఈశాన్య భారతావనిలో పౌర గణన, వారికి గుర్తింపు కార్డులు అందించడం తదితర పనులు శరవేగంగా సాగుతున్నాయి. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కాందిశీకులను గుర్తించడమే ప్రస్తుతం ప్రభుత్వ ఉద్దేశం. ఈ విషయంలో విమర్శలు వెల్లువెత్తుతున్నా, కేంద్రం తనపని తాను చేసుకుపోతోంది.

ఇప్పటికే ట్రిపుల్ తలాక్ బిల్లుతో ముస్లిం మహిళలకు దగ్గరైన బీజేపీ ప్రభుత్వం, వారికి పూర్తి సంక్షేమాన్ని దగ్గర చేయాలన్న దిశగా అడుగులు వేస్తోంది. ఉజ్వల యోజన వంటి పథకాల్లో అత్యధిక లబ్దిదారులు పేద ముస్లిం మహిళలే ఉండటం గమనార్హం. దేశంలో మైనారిటీ వర్గంగా ఉన్న ముస్లింల ఓట్లు సైతం గడచిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీవైపే మొగ్గు చూపాయి. అందుకే మతతత్వ పార్టీగా ముద్రపడినా, బీజేపీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించిన సీట్లను గెలుచుకుందనడంలో సందేహం లేదు.

ప్రస్తుతానికి నరేంద్ర మోదీ ఏ పని చేపట్టినా అందుకు అడ్డుపడేవారు ఎవరూ లేరని బీజేపీ నేతలు అంటున్నారు. వాస్తవానికి అది నిజమే. ఇదే సమయంలో పీఓకేను స్వాధీనం చేసుకోవడం అంత సులువు కాదు. దానికి ఎన్నో అవాంతరాలు వస్తాయి. పొరుగున ఉన్న పాకిస్థాన్ తో యుద్ధమే రావచ్చు. పీఓకే భారత్ స్వాధీనమైతే, తమ అధీనంలో ఉన్న సియాచిన్ ప్రాంతంపై భారత్ కన్నేస్తుందన్న ఆందోళన, చైనాను కూడా యుద్ధంలోకి దింపవచ్చు. అదే జరిగితే, పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలనూ తోసిపుచ్చలేం. ఈ సమయంలో మోదీ మనసులో ఏముందోనన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది.

More Telugu News