టీఎస్‌ ఆర్టీసీ ఈయూ కార్యాలయంలో కీలక భేటీ : హాజరైన అఖిల పక్షం నాయకులు

10-11-2019 Sun 11:35
  •  సర్వజనుల సామూహిక దీక్ష ఉద్రిక్తం నేపథ్యంలో సమావేశం
  • పలు అంశాలపై కూలంకుషంగా చర్చించిన నేతలు
  • తదుపరి కార్యాచరణపై సమాలోచనలు
టీఎస్‌ ఆర్‌టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో అఖిపక్ష నాయకుల కీలక భేటీ జరిగింది. ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు నిన్న ట్యాంకుబండ్‌పై తలపెట్టిన సర్వజనుల సామూహిక దీక్ష ఉద్రిక్తమైన నేపథ్యంలో ఈ భేటీ జరగడం విశేషం. సమావేశానికి ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ అశ్వత్థామరెడ్దితోపాటు సీనియర్‌ కాంగ్రెస్‌ నేత భట్టివిక్రమార్క, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, వామపక్షాల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ట్యాంక్‌బండ్‌పై పరిణామాలు, రేపు హైకోర్టులో వాదనలు, భవిష్యత్ కార్యాచరణ, విపక్షాల మద్దతు సమీకరణ వంటి అంశాలపై నాయకులు కూలంకుషంగా చర్చించారు.