Ayodhya: అయోధ్య తీర్పు... ఆ 116 పేజీలూ రాసిందెవరో ఎప్పటికీ రహస్యమే!

  • 1045 పేజీల తీర్పునకు 116 పేజీల అనుబంధం
  • సమగ్ర వివరణ ఇచ్చిన ధర్మాసనం
  • రాసిందెవరో మాత్రం వెల్లడించని అధికారులు

1045 పేజీలున్న తీర్పు... దీనికి అనుబంధంగా 116 పేజీల బుక్ లెట్. దశాబ్దాలుగా నలిగిన అయోధ్య కేసులో తుది తీర్పు వచ్చేసింది. ఈ వివాదాస్పద స్థలం శ్రీరాముడు జన్మించిన స్థలమేనని నమ్మేందుకు ఆధారాలు ఏమున్నాయి? వాటి విశ్వసనీయత ఏంటి? అన్న విషయాలపై ఎన్నో ఆధారాలను చూపుతూ సమగ్ర వివరణ ఈ 116 పేజీల్లో ఉంది.

వాస్తవానికి కోర్టులు ఇచ్చే ఏ తీర్పు అయినా, దాన్ని రాసిన న్యాయమూర్తి ఎవరు? అనుబంధ ప్రతులను రచించిందెవరన్న విషయాన్ని తెలియజేస్తారు. కానీ, అయోధ్య కేసు విషయంలో మాత్రం ఈ సంప్రదాయాన్ని పాటించలేదు.

తీర్పును సుప్రీంకోర్టు సీజే రంజన్ గొగోయ్ చదివారు. ఈ కేసును విచారించిన తుది ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎస్ఏ బాబ్డే, అశోక్ భూషణ్, నజీర్, చంద్రచూడ్ ఉన్నారు. వారిలో తీర్పును ఎవరు రాశారన్న విషయాన్ని ప్రస్తావించలేదన్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే, తీర్పుకు అత్యంత కీలకమైన అనుబంధంగా ఉన్న 116 పేజీలను ఎవరు రచించారన్న విషయాన్ని కూడా రహస్యంగా ఉంచారు. ఇక భవిష్యత్తులోనూ ఈ పేర్లు వెల్లడయ్యే పరిస్థితి లేకపోవడంతో, తీర్పు రాసిన వారి పేరు ఎప్పటికీ రహస్యంగానే ఉండనుంది. వారి పేర్లను బయటపెడితే, ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చన్న కోణంలోనే రహస్యంగా ఉంచినట్టు అధికారులు చెబుతున్నారు. 

More Telugu News