Maharashtra: ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఫడ్నవీస్ ను ఆహ్వానించిన మహారాష్ట్ర గవర్నర్

  • నిన్ననే సీఎంగా రాజీనామా చేసిన ఫడ్నవీస్
  • మహా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు
  • ఎన్నికల ఫలితాలు వచ్చి వారాలు గడుస్తున్నా ఏర్పాటుకాని ప్రభుత్వం

మహారాష్ట్ర రాజకీయం ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ తాజాగా బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ను రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆహ్వానించారు. తమ ప్రభుత్వ పదవీకాలం ముగియడంతో ఫడ్నవీస్ నిన్ననే సీఎంగా రాజీనామా చేశారు. ఎన్నికల్లో కలిసి పోటీచేసిన బీజేపీ, శివసేన పార్టీలకు సీఎం పీఠం వద్ద పేచీ వచ్చింది. దాంతో ఫలితాలు వచ్చి వారాలు గడుస్తున్నా ప్రతిష్టంభన తొలగిపోలేదు.

మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉండగా, బీజేపీ-శివసేన కూటమికి 163 సీట్లు లభించాయి. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 103 స్థానాలు సంపాదించింది. ఇతరులకు 22 స్థానాలు లభించాయి. అయితే సీఎం పీఠంపై కన్నేసిన శివసేన ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములా ప్రతిపాదించింది. సీఎం పీఠాన్ని పంచుకోవాలని కోరగా, బీజేపీ అంగీకరించలేదు. దాంతో ప్రభుత్వ ఏర్పాటులో విపరీతమైన జాప్యం ఏర్పడింది.

కాగా , సోమవారం బలనిరూపణ చేయాల్సిందిగా ఫడ్నవీస్ కు గవర్నర్ సూచించారు. అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా బీజేపీకి ఈ అవకాశం కల్పించారు. ఎన్నికల్లో బీజేపీకి 105 సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన 145 స్థానాల మార్కుకు సుదూరంగా నిలిచిపోయింది.

More Telugu News