sc garg: రూ.2,000 నోటును కూడా దాచిపెడుతున్నారు.. రద్దు చేయాల్సిందే: ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి

  • వ్యవస్థలో నగదు చలామణి ఇంకా కొనసాగుతోంది
  • చాలా వరకు పెద్ద నోట్ల చలామణిలోకి రావడం లేదు
  • రద్దు చేయడమో, వెనక్కి తీసుకోవడమో చేయాలి

పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.2000 నోటును కూడా రద్దు చేయాలని ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి ఎస్‌సీ గార్గ్ అభిప్రాయపడ్డారు. ఆ నోటును కూడా దాచి ఉంచుతున్నట్టు ఆధారాలు ఉన్నాయని అన్నారు. డిజిటల్ చెల్లింపు వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోందని, భారత్‌లో మాత్రం నెమ్మదిగా సాగుతోందని అన్నారు. వ్యవస్థలో నగదు చలామణి ఇంకా కొనసాగుతోందన్నారు.

ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్ల విలువలో మూడోవంతు రూ.2000 నోట్లే ఉన్నాయన్నారు. అయితే, వాటిని కూడా దాచి పెడుతుండడం వల్ల వీటిలో చాలావరకు చలామణిలోకి రావడం లేదన్నారు. రోజువారీ లావాదేవీలలోకి రాని వీటిని వెనక్కి తీసుకోవడమో, రద్దు చేయడమో చేయాల్సిన అవసరం ఉందని గార్గ్ అన్నారు. ప్రస్తుతం ఉన్న రూ. 2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యేలా చర్యలు తీసుకుంటే సరిపోతుందని, దీనివల్ల ఇబ్బందులు కూడా ఉండవని అన్నారు.

More Telugu News