West Bengal: బెంగాల్ ఎవరికీ లొంగదు... గొప్పవాళ్లంతా మా రాష్ట్రం నుంచే వచ్చారు: మమతా బెనర్జీ

  • జీవితకాలం పోరాడతాం కానీ తలవంచబోమని ధీమా
  • ఇతరులపై అసూయ లేదని వెల్లడి
  • బెంగాలీ చిత్ర దర్శకులపై ప్రశంసలు

శాస్త్రీయ, సాంస్కృతిక అభివృద్ధిలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. తమ రాష్ట్రం ఇతరుల ముందు ఎప్పటికీ తలవంచబోదన్నారు. 25వ కోల్ కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన చిత్ర దర్శకులు దశాబ్దాలుగా సమగ్రత, ఐక్యత సందేశాలను చాటుతున్నారని ప్రశంసించారు.

అవార్డులు తెచ్చే చిత్రాలను రూపొందించే దర్శకులు, ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాలను పొందినవారు కూడా తమ రాష్ట్రం నుంచే ఎక్కువమంది ఉన్నారని దీదీ చెప్పారు. ఇతరులపై తమకు అసూయ లేదని స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరితో సానుకూల దృక్పథంతోనే వ్యవహరిస్తామని అన్నారు. జీవితకాలం పోరాడతాం కానీ ఇతరుల ముందు తలవంచబోమని పేర్కొన్నారు.

ఈ చలనచిత్రోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్ననిర్మాత మహేష్ భట్ పై మమత ప్రశంసలు కురిపించారు. భట్ నిర్మొహమాటంగా మాట్లాడతారని, జంకరని, నిక్కచ్చిగా అభిప్రాయాన్ని చెబుతారని అన్నారు. 76 దేశాలు పాలుపంచుకుంటున్న ఈ చిత్రోత్సవంలో 367 చిత్రాలు, 214 ఫీచర్ ఫిల్మ్స్, 153 షార్ట్ డాక్యుమెంటరీలు ప్రదర్శిస్తారు.

More Telugu News