puducherry: యాచకురాలి బ్యాంకు ఖాతాలో రూ.2 లక్షలు.. చేతిలో రూ.12 వేల నగదు!

  • పుదుచ్చేరిలో ఘటన
  • ఇటీవల అస్వస్థతకు గురైన యాచకురాలు
  • వైద్య సాయం అందించాలని కోరడంతో ఆరా తీసిన మందిర సిబ్బంది 

గుడి మెట్లపై కూర్చొని భక్తులు ఇచ్చే చిల్లర తీసుకునే ఓ యాచకురాలి బ్యాంకు ఖాతాలో రెండు లక్షల రూపాయలు ఉన్నాయి. అలాగే, ఆమె వద్ద మరో 12,000 రూపాయల నగదు, ఆధార్ కార్డు కూడా లభించాయి. చిల్లర కూడబెట్టి ఇంత డబ్బు సంపాదించిందని తెలుసుకున్న అధికారులు ఆశ్చర్యపోయారు.

వివరాల్లోకి వెళితే, పుదుచ్చేరిలోని ఓ మందిరం వద్ద పార్వతం (70) భిక్షాటన చేస్తుంది. ఆమె ఇటీవల అస్వస్థతకు గురైంది. దీంతో తనకు వైద్య సాయం అందించాలని అక్కడున్న వారిని కోరింది. దీంతో ఆమె గురించి మందిర సిబ్బంది ఆరా తీసి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె వద్ద పెద్ద మొత్తంలో డబ్బున్నట్లు తెలిసింది.

ఓ పోలీసు అధికారి ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ... 'ఆమెకు బ్యాంకు ఖాతా ఉంది. అందులో రూ.2 లక్షలు, ఆమె వద్ద మరో 12 వేల రూపాయలు ఉన్నాయి. ఆమె తమిళనాడులోని కళ్లి కురుచికి చెందిన వ్యక్తి. ఆమె బంధువులకు ఆమెను అప్పగించాం' అని తెలిపారు.

ఆమె భర్త 40 ఏళ్ల క్రితమే మృతి చెందాడని, అప్పటి నుంచి పుదుచ్చేరిలోని రోడ్లపై ఆమె భిక్షాటన చేస్తూ గడుపుతోందని పోలీసులు తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా ఆమె మందిరం వద్దే ఉంటోందని ఓ దుకాణదారుడు చెప్పాడు. భక్తులు పెట్టే భోజనంతో ఆమె కడుపు నింపుకుంటుందని చెప్పారు. ఆమె వద్ద అంత డబ్బుందని తమకు ఇప్పుడే తెలిసిందని అన్నారు. పోలీసుల చొరవతో ప్రస్తుతం ఆమె తన సోదరుడి వద్ద ఉంటోంది.

More Telugu News