Buddhavenkanna: ఎందుకింత 'తెగులు' అంటూ మీ పత్రికే కదా రాసింది!: వైసీపీపై బుద్ధా వెంకన్న విమర్శలు

  • జగన్ కి తెలుగు చూసి చదవడం రాదు
  • ఆ మాత్రానికే ఎటువంటి ప్రణాళిక లేకుండా తెలుగు మీడియంను ఎత్తేస్తారా?
  • స్కూల్స్ అన్నింటినీ ఇంగ్లిష్ మీడియంగా చేసేస్తాం అంటే ఎలా?

పాఠశాల విద్యను ఆంగ్ల మాధ్యమంలోనే నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు కురిపించారు. గతంలో ఇదే నిర్ణయాన్ని చంద్రబాబు సర్కారు ప్రకటిస్తే తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు మాత్రం మరోలా మాట్లాడుతున్నారని అన్నారు.  

'నిరా రక్షత, దీవితాన్ని, సంఘ సస్కర్తలు, రాజిక సౌద్దన్నాన్ని అని మీ తింగరి మాలోకం చదివిన తరువాత మీకు తెలుగుపై కోపం రావడం సహజం. చూసి చదవడం రానంత మాత్రాన ఎటువంటి ప్రణాళిక లేకుండా ఉన్నట్టుండి తెలుగు మీడియం స్కూల్స్ అన్నిటినీ ఇంగ్లిష్ మీడియంగా చేసేస్తాం అంటే ఎలా ఎంపీ విజయసాయి రెడ్డి గారు?' అని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.

'అన్నట్టు మీ దొంగ మీడియాలో రాసేవి అన్ని అసత్యాలు అని మీరే ఒప్పుకోవడం హైలైట్. చంద్రబాబు గారు ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ పెడతానంటే మీ తెలుగు లెస్సేనా, ఎందుకింత తెగులు అని మీ పత్రిక రాసింది. కాస్తయినా మీలో సిగ్గు ఉంటే, నీచంగా చిన్న పిల్లల గురించి ఇక మీదట ట్వీట్స్ పెట్టరని అనుకుంటున్నాను' అన్నారు.

కాగా, 'నిరా రక్షత అంటే నిరక్ష్యరాస్యత, దీవితాన్ని పణంగా అంటే.. జీవితాన్ని అనుకుంటా.. సంఘ సస్కర్తలు అంటే సంఘ సంస్కర్తలు కాబోలు.. కానీ చివర్లో అన్నారు చూడండి..ఆ 'రాజిక సౌద్దన్నాన్ని' అని.. అద్గది అది మాత్రం అర్థం కాలేదు. మీకు అర్థం అయితే చెబుతారా విజయసాయి రెడ్డి గారు' అంటూ ఇటీవల బుద్ధా వెంకన్న ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. విజయవాడలో రాష్ట్రావతరణ వేడుకల సందర్భంగా జగన్ వ్యాఖ్యల్లో దొర్లిన తప్పులను ఎత్తి చూపుతూ బుద్ధా వెంకన్న ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో విమర్శలు రావడంతోనే జగన్ కి తెలుగుపై సహజంగానే కోపమొచ్చిందంటూ ఈ రోజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

More Telugu News