Tamil Nadu: నాన్న కోరిక మేరకే రాజకీయాల్లోకి వచ్చాను: కమలహాసన్‌

  • కుటుంబ సభ్యులు ఎవరికీ ఇష్టంలేకున్నా ఆయన కోసమే ఈ ప్రస్థానం
  • గతిలేక ఎంఎన్‌ఎం పార్టీ ఏర్పాటు చేయలేదు
  • నాన్న కల నెరవేర్చినందుకు చాలా ఆనందంగా ఉంది

తండ్రి కోరిక నెరవేర్చడం తనయుడిగా తన బాధ్యతని, తనను రాజకీయ నాయకుడిగా చూడాలన్న తండ్రి శ్రీనివాసన్‌ ఆకాంక్ష మేరకే తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టానని ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌ స్పష్టం చేశారు. గత్యంతరం లేకో, మరో ఉద్దేశంతోనో తన రాజకీయ ప్రవేశం జరగలేదని స్పష్టం చేశారు. నిన్న తన పుట్టిన రోజు సందర్భంగా స్వస్థలం పరమకుడిలో ఏర్పాటు చేసిన తండ్రి శ్రీనివాసన్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కమల్‌ పాల్గొన్నారు.

తాను రాజకీయాల్లోకి రావడం తమ కుటుంబ సభ్యులు ఎవరికీ ఇష్టం లేదని, ఒక్క నాన్న మాత్రమే కోరుకునే వారని తెలిపారు. 'నాన్న ఆకాంక్ష తెలుసుకున్న తర్వాత, మీరు స్వాతంత్య్ర సమరయోధులైనంత మాత్రాన నేను రాజకీయాల్లోకి రావాలా? అని చాలా సందర్భాల్లో ఆయనను ప్రశ్నించాను... ‘ఒక వేళ వస్తే...’ అంటూ ఆయన ఎదురు ప్రశ్నించే వారు... ఇప్పుడు ఆయన మాటే నిజమైంది' అని కమల్‌ తెలిపారు.

‘నేను ఐఏఎస్‌ అధికారిని కావాలని నాన్న కలలుకనే వారు. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ఆయన ఇదే కోరేవారు. కనీసం సాయంత్రం కళాశాలకైనా వెళ్లి చదువుకోమని చెప్పేవారు. కానీ దర్శకుడు బాలచందర్‌ నాకు పని ఇచ్చాక చదువు ఎక్కలేదు’ అంటూ కమల్‌ పాతజ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు.

తనకు చదువు వచ్చా? లేదా? అంటే కచ్చితంగా సమాధానం చెప్పలేనుగాని, నైపుణ్యం మాత్రం ఉందని ధైర్యంగా చెప్పగలనని తెలిపారు. కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో నాన్నను చూసి నేర్చుకోవాలన్నారు. హాస్యం కూడా నాన్న నుంచే తనకు అలవడిందని, రౌద్రం కూడా తనకు ఇష్టమని చెప్పారు.

'సినీ పరిశ్రమలో నాకు నీడగా నిలిచిన కె.బాలచందర్‌ పట్ల కృతజ్ఞతా భావంతోనే నా కార్యాలయంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాను. చెన్నై వెళ్లాక దాన్ని ఆవిష్కరిస్తాను' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమల్ కుటుంబ సభ్యులు చారుహాసన్‌, సుహాసిని, శ్రుతిహాసన్‌, అక్షర, ఇతర కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు.

More Telugu News