TSRTC: హైకోర్టు, శాసనసభ, ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి: భట్టి విక్రమార్క

  • ప్రభుత్వం సరైన వివరాలు హైకోర్టుకు సమర్పించలేదన్న భట్టి
  • గతంలో శాసనసభకూ తప్పుడు సమాచారమిచ్చారని వెల్లడి
  • జేఏసీ మిలియన్ మార్చ్ కు కాంగ్రెస్ మద్దతుంటుందన్న భట్టి

తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై  విచారణ కొనసాగుతున్నప్పుడు అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారని హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. ఆర్టీసీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభకు తప్పుడు సమాచారం ఇచ్చిందని గతంలో తాము చెప్పామని గుర్తు చేశారు.

ఈ రోజు సీఎల్పీ కార్యాలయంలో భట్టి మీడియాతో మాట్లాడుతూ... న్యాయస్థానాలు, రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ కు ఏమాత్రం గౌరవమున్నా శాసనసభ, హైకోర్టు, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలతోపాటు హైకోర్టు, శాసనసభను కూడా మోసం చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వాలు ఆర్టీసీ ఆస్తులను కాపాడుకుంటూ వస్తే, ప్రస్తుత ప్రభుత్వం వాటిని అమ్మకానికి పెడుతోందని విమర్శించారు. జేఏసీ ఈ నెల 9న తలపెట్టిన మిలియన్ మార్చ్ కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతిస్తుందని చెప్పారు. ఆర్టీసీ ఆస్తుల ప్రైవేటీకరణే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని భట్టి ఆక్షేపించారు.

More Telugu News