Kartarpur: కర్తార్ పూర్ యాత్రికులపై పాకిస్థాన్ గందరగోళం సృష్టిస్తోంది: కేంద్రం

  • త్వరలో కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభం
  • పాక్ విరుద్ధ ప్రకటనలు చేస్తోందన్న విదేశాంగ శాఖ
  • పాస్ పోర్టు విషయంలో పూటకో మాట మాట్లాడుతున్నారని ఆరోపణ

మరో రెండ్రోజుల్లో పాకిస్థాన్ లో కర్తార్ పూర్ సాహిబ్ కారిడార్ ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. భారత యాత్రికులను అనుమతించే విషయంలో పాక్ నుంచి విరుద్ధ ప్రకటనలు వస్తున్నాయని, తద్వారా గందరగోళం ఏర్పడుతోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కొన్నిసార్లు పాస్ పోర్ట్ అవసరం అంటున్నారని, మరి కొన్నిసార్లు పాస్ పోర్ట్ అవసరం లేదంటున్నారని వెల్లడించారు. దీన్ని బట్టి పాక్ విదేశాంగ శాఖ కార్యాలయానికి, ఇతర పాక్ సంస్థలకు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్టు అర్థమవుతోందని అన్నారు.

భారత్, పాక్ మధ్య ఈ విషయంలో ఒక అవగాహన ఒప్పందం ఉందని, దీని ప్రకారం పాస్ పోర్ట్ అవసరం అని రవీశ్ కుమార్ స్పష్టం చేశారు. అందువల్ల ఏకపక్షంగా ఈ ఒప్పందాన్ని మార్చడం కుదరదని, ఇరు పక్షాల ఆమోదంతోనే ఒప్పందాన్ని సవరించే వీలుంటుందని అన్నారు.

కాగా, నవంబరు 1న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, భారత్ నుంచి కర్తార్ పూర్ వచ్చే యాత్రికులకు పాస్ పోర్ట్ అవసరంలేదని, చెల్లుబాటు అయ్యే ఐడీ కార్డు ఉంటే చాలని చెప్పారు. కానీ, పాక్ సైన్యం మాత్రం ససేమిరా అంటోంది. భద్రతా కారణాల రీత్యా భారత యాత్రికులు పాస్ పోర్టు కలిగి ఉండాల్సిందేనని మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ప్రకటించారు. దేశ భద్రత, సమగ్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు.

More Telugu News