బాగ్దాదీని హతమార్చడంతో ఐసిస్ కథ ముగిసిపోదు: ఆస్ట్రేలియా కాన్ఫరెన్స్ లో కిషన్ రెడ్డి

07-11-2019 Thu 10:56
  • బిన్ లాడెన్ ను చంపిన తర్వాత కూడా ఆల్ ఖాయిదా అనుబంధ సంస్థలు పని చేస్తున్నాయి
  • ఉగ్రవాదులకు సాయం అందిస్తున్న దేశాలపై ఉక్కుపాదం మోపాలి
  • 'నో మనీ ఫర్ టెర్రర్' కాన్ఫరెన్స్ లో కిషన్ రెడ్డి
ఐసిస్ అధినేత బాగ్దాదీని హతమార్చినంత మాత్రాన ఆ ఉగ్ర సంస్థ అంతరించిపోదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అస్టేలియాలోని మెల్ బోర్న్ లో జరుగుతున్న 'నో మనీ ఫర్ టెర్రర్' కాన్ఫరెన్స్ లో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

 కాన్ఫరెన్స్ కు హాజరైన 65 దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, అల్ ఖాయిదా అధినేత బిన్ లాడెన్ అమెరికా హతమార్చిన తర్వాత కూడా ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న పలు సంస్థలు ఇంకా పని చేస్తూనే ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో, బాగ్దాదీ మరణం తర్వాత ఆ సంస్థ పని అయిపోయిందని భావించడం పొరపాటు అవుతుందని చెప్పారు.

ఉగ్ర సంస్థలకు కొన్ని దేశాలు అందిస్తున్న సహాయంపై ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందిస్తున్న ఇలాంటి దేశాలకు వ్యతిరేకంగా అన్ని దేశాలు ఏకం కావాల్సి ఉందని సూచించారు. ఉగ్రవాదుల వల్ల భారత్ ఇప్పటికే ఎంతో నష్టపోయిందని... ఈ నేపథ్యంలో, ఉగ్రవాదంపై అందరూ ఉక్కుపాదం మోపాలని కోరుతోందని చెప్పారు. 2020లో జరిగే 'నో మనీ ఫర్ టెర్రర్' కాన్ఫరెన్స్ ను భారత్ నిర్వహిస్తుందని ప్రకటించారు. మరోవైపు, ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్ కు ఐదుగురు సభ్యుల హై పవర్డ్ డెలిగేషన్ హాజరైంది. వీరిలో ఎన్ఐఏ డెరెక్టర్ జనరల్ వైసీ మోదీ కూడా ఉన్నారు.