T20 format: యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు మేం ఎంచుకున్న ఫార్మాట్ ఇదే: రోహిత్ శర్మ

  • టి20ల్లో యువకులతోనే బరిలో దిగుతున్నట్టు వెల్లడి
  • రిజర్వ్ బెంచ్ పటిష్టంగా ఉండాలన్న హిట్ మ్యాన్
  • టి20ల ద్వారా ఎంతోమంది వన్డే, టెస్టు జట్లలోకి వచ్చారని వ్యాఖ్యలు

యువ ఆటగాళ్ల ప్రతిభను పరీక్షించేందుకు పొట్టి ఫార్మాట్ సరైన వేదికని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టీ20 ల్లో భారత్ వెనకబడటానికి కీలకమైన ఆటగాళ్లు ఆడకపోవడం కూడా ఒక కారణమని చెప్పాడు. ‘యువ ఆటగాళ్లను పరీక్షించడానికి మేము ఎంచుకున్న ఫార్మాట్ టీ20. కీలక ఆటగాళ్లు లేకపోవడంతో యువకులతోనే ప్రయత్నిస్తున్నాం. పరాజయాలకు ఇది ఒక కారణం. ఎందుకంటే మిగతా ఫార్మాట్లలో పటిష్ట జట్టుతో ఆడతాం. అయితే, పొట్టి ఫార్మాట్లో యువకులను పరీక్షించడం వల్ల జట్టుకు హాని లేదు’ అని అన్నాడు.

ఈ ఫార్మాట్లో సామర్థ్యం నిరూపించుకుని ఎంతో మంది యువకులు వన్డే, టెస్ట్ జట్లకు ఎంపికయ్యారని, రిజర్వ్ బెంచ్ సాధ్యమైనంత పటిష్టంగా ఉండాలనుకుంటున్నామని చెప్పాడు. మ్యాచ్ లు గెలిచి తీరాల్సిందేనని... ఓటముల నుంచి యువకులు పాఠాలు నేర్చుకుంటారని రోహిత్ అన్నాడు. భారత జట్టు టీ 20ల్లో 2018లో వెస్టిండీస్ పై సాధించిన విజయం తర్వాత ఆసీస్ చేతిలో పరాజయం పాలైంది. సఫారీ జట్టుతో సిరీస్ ను 1-1తో సమం చేసింది. తాజాగా బంగ్లాదేశ్ తో సిరీస్ తొలిమ్యాచ్ లో చేతులెత్తేసిన నేపథ్యంలో రోహిత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్- బంగ్లాదేశ్ మధ్య రెండో టీ 20 మ్యాచ్ రాజ్ కోట్ లో రేపు జరగనుంది.

More Telugu News