India: మీరా మాకు నీతులు చెప్పేది?... ఐరాసలో పాకిస్థాన్ వాదనలను మరోసారి తిప్పికొట్టిన భారత్

  • భద్రతామండలి సమావేశానికి హాజరైన భారత్, పాక్
  • దాయాదుల వాదోపవాదాలు
  • మరోసారి చర్చకు వచ్చిన కశ్మీర్ అంశం

అంతర్జాతీయ వేదికలపై భారత్ ను ఎలాగైనా దోషిగా నిలబెట్టాలని పాకిస్థాన్ ప్రయత్నించడం, తిరిగి తానే దెబ్బతినడం పరిపాటిగా మారింది. తాజాగా మరోసారి ఇదే ప్రయత్నం చేసిన పాకిస్థాన్ కు భారత్ దీటైన జవాబిచ్చింది. న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో భారత్, పాక్ లు కూడా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా పాక్ ప్రతినిధి మలీహా లోథీ భారత్ పై అక్కసు వెళ్లగక్కారు. కశ్మీర్ లో మహిళలను అణచివేస్తున్నారని, మహిళల హక్కులను కాలరాస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

దీనికి భారత్ తరఫున పలోమీ త్రిపాఠీ గట్టిగా స్పందించారు. నిత్యం ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ, రాజకీయ స్వార్థం కోసం మహిళల గొంతు నొక్కే ఓ దేశం ఇప్పుడు భారత్ కు నీతులు చెబుతోందంటూ సమర్థంగా వాదనలు వినిపించారు. పాక్ అనుసరిస్తున్న విధానాలు భారత్ లో ప్రభావం చూపిస్తున్నాయని, వేల కుటుంబాలు నాశనం అయ్యాయని ఆరోపించారు. అర్థరహితమైన వాదనలు చేయడం పాక్ కు కొత్త కాదని, కశ్మీర్ పై పాక్ అభ్యంతరాలకు గత భద్రతామండలి సమావేశాల్లో ఎక్కడా మద్దతు లభించలేదని, ఇదే వైఖరి మున్ముందు కూడా కొనసాగాలని కోరుకుంటున్నట్టు పలోమీ విజ్ఞప్తి చేశారు.

More Telugu News