Road Accident: ప్రమాదం జరిగిన కారులో భారీగా గంజాయి.. అవాక్కయిన పోలీసులు

  • ఘటనా స్థలిలోనే చనిపోయిన కారు యజమాని
  • మృతుడు వైరాలో జూనియర్‌ లైన్‌మెన్‌
  • అడ్డదారిలో సంపాదనకు వక్ర మార్గం

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండ సమీపంలో నిన్న తెల్లవారు జామున ఓ కారు అతివేగం కారణంగా పల్టీకొట్టింది. కారు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. తీరా కారును పరిశీలించి అవాక్కయ్యారు. కారులో గుట్టగుట్టలుగా గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి.

ఖమ్మం ఏసీపీ రామోజీరమేష్‌ తెలిపిన వివరాల మేరకు ... తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా చెవ్వెంల మండలం మాన్యానాయక్‌ తండాకు చెందిన బాణోతు సురేందర్‌ (27) వైరాలో జూనియర్‌ లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అంతకు ముందు కారు డ్రైవర్‌గా పని చేసిన ఇతనికి రెండు నెలల క్రితమే ఉద్యోగం వచ్చింది. అయితే అడ్డదారిలో డబ్బు సంపాదనకు అలవాటు పడిన సురేందర్‌ ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా తన పాత అలవాటు మానుకోలేదు.

ఇందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం వరకు పవర్‌ వీక్‌ విధుల్లో పాల్గొన్న  సురేందర్‌ అనంతరం కారులో బయలుదేరాడు.  ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడన్న దానిపై స్పష్టత లేదు. ప్రమాదం జరిగిన కారు నుంచి మొత్తం ఒక్కొక్కటీ దాదాపు 10 కిలోల చొప్పున మొత్తం 50 ప్యాకెట్లలో  508 కిలోల గంజాయి లభించింది. దీని విలువ 76 లక్షల పైనే ఉంటుందని పోలీసులు తెలిపారు.

వాహనం విశాఖ పరిసరాల నుంచి వస్తోందని పోలీసులు అంచనాకు వచ్చారు. బహుశా సురేందర్‌ ఉద్యోగ విధుల తర్వాత తన పాత అలవాటు మేరకు భారీ మొత్తం వస్తుందన్న ఆశతో గంజాయి రవాణాకు ఒప్పుకుని ఉంటాడని, విశాఖలోని రహస్య ప్రాంతానికి వెళ్లి దీన్ని తీసుకుని హైదరాబాద్‌కు చేరవేసే ప్రయత్నంలో ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు  భావిస్తున్నారు.  

More Telugu News