Delhi police: ఢిల్లీలో ముదిరిన పోలీసులు, లాయర్ల వివాదం.. నిరసన బాట పట్టిన పోలీసులు

  • తప్పెవరిదో తేల్చేవరకు ఆందోళన ఆపమంటున్న పోలీసులు
  • తీవ్రమవుతున్న న్యాయవాదులు, పోలీసుల మధ్య వివాదం
  • పోలీసుల ఆందోళనకు మద్దతు ప్రకటించిన ఐపీఎస్ అసోసియేషన్

ఢిల్లీ పోలీసులు, న్యాయవాదుల మధ్య తలెత్తిన వివాదం తీవ్రమవుతోంది. న్యాయవాదుల తీరును నిరసిస్తూ పోలీసులు నిరసన బాట పట్టారు. ఈరోజు ఢిల్లీ పోలీసులు, అధికారులు పోలీస్ హెడ్ క్వార్టర్స్ వద్ద ‘మాకు న్యాయం చేయాలి’ అన్న ప్లకార్డులు పట్టుకొని ఆందోళనలో పాల్గొన్నారు. శనివారం నాటి ఘటనకు సంబంధించి వీడియో రికార్డింగ్ చూసి తప్పెవరిదో తేల్చాలని డిమాండ్ చేశారు. పోలీసుల నిరసనకు ఐపీఎస్ అసోసియేషన్ మద్దతు తెలిపింది.  దేశంలోని పోలీసుల మద్దతు మీకుంటుందని అసోసియేషన్ వారికి హామీ ఇచ్చింది.  ఆందోళన విరమించాలని ఉన్నతాధికారులు కోరుతున్నప్పటికీ తప్పు చేసిన వారిని గుర్తించేవరకు ఆందోళన ఆపేది లేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.

 శనివారం, తీస్ హజారీ కోర్టు ప్రాంగణం వద్ద పార్కింగ్ విషయంలో న్యాయవాదులు, పోలీసుల మధ్య చోటుచేసుకున్న వివాదం ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. అనంతరం న్యాయవాదుల వైఖరిని వ్యతిరేకిస్తూ పోలీసులు నిరసనకు దిగారు. ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతూ నేటికి  నాలుగోరోజుకు చేరింది. వీరి మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన దృశ్యాల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

మరోవైపు న్యాయవాదులు తమపై పోలీసులు కాల్పులు జరిపారని ఆరోపించారు. ఈ ఘటనలో ఓ న్యాయవాది గాయపడగా ఆయనను ఆస్పత్రిలో చేర్పించామని చెప్పారు. సోమవారం సాకేత్ కోర్టులో ఓ పోలీసుపై కొంతమంది న్యాయవాదులు దాడి చేశారు. ఈ ఘర్షణకు పోలీసుల తీరే కారణమని న్యాయవాదులు నిరసన చేపట్టారు. కాగా, తమ వాహనాలకు నిప్పు పెట్టారని, ఘర్షణ తీవ్రం కావడంతోనే తాము గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు చెపుతున్నారు. 

More Telugu News