Sujana Chowdary: ఇలాగైతే రాష్ట్రం కోలుకోవడం కష్టం: జగన్ సర్కారుపై సుజనా చౌదరి విమర్శలు

  • ఏపీకి కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదు
  • సర్కారు విధానాలతో పారిశ్రామిక వేత్తలు రాని పరిస్థితి 
  • ఇప్పటికైనా సర్కారు సమర్థవంతమైన పాలనపై దృష్టి సారించాలి  

ఆంధ్రప్రదేశ్ సర్కారు తీరుపై బీజేపీ నేత సుజనా చౌదరి విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ కి ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా రాలేదని, సర్కారు విధానాలతో పారిశ్రామిక వేత్తలు రాని పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా సర్కారు సమర్థవంతమైన పాలనపై దృష్టి సారించాలని, లేదంటే ఏపీ కోలుకోవడం కష్టమని విమర్శించారు.

నేతలు వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతున్నారని సుజనా చౌదరి అన్నారు. ఈ ఐదు నెలల కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా అమలు కావట్లేదని ఆయన అన్నారు. తీసుకున్న నిర్ణయాలు ఒక ప్రణాళిక లేకుండా ఉంటున్నాయని విమర్శించారు. ఐదు నెలలుగా ఇసుక కొరతకు పరిష్కారం చూపలేదన్నారు.

కొన్ని అంశాలపై ప్రభుత్వం చూపుతోన్న తీరు బాగోలేదని సుజనా చౌదరి అన్నారు. 'మీడియాపై ఆంక్షలు పెట్టారు. తమకు అనుకూలంగా పనిచేసే ప్రభుత్వ అధికారులనే సర్కారు ప్రోత్సహిస్తోంది. ప్రజలను సామాజిక వర్గాల వారీగా విడదీస్తున్నారు. రైతుల దగ్గరి నుంచి అధికారుల వరకు సామాజిక వర్గాల వారీగా విడదీస్తూ, వారి ఐక్యతను దెబ్బకొడుతూ పాలన కొనసాగిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు' అని విమర్శించారు.

'ఇసుకపై ప్రణాళిక వేసుకొని, అమలు చేయడంలో విఫలమయ్యారు. సమస్యల గురించి మాట్లాడితే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. పవన్ కల్యాణ్ ఇటీవల ఈ సమస్యపై మాట్లాడితే ప్రభుత్వం ఇదే తీరును కనబర్చింది. ఎన్నికల ముందు ఎలా మాట్లాడారో, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు. అంతేగానీ, పాలనపై దృష్టిపెట్టట్లేదు. మద్యం పాలసీని కూడా ఎవరి కోసం తీసుకొచ్చారు? మరోవైపు, పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ మొదలుపెట్టారు. మేము మొదటి నుంచీ చెబుతున్నాం. ఇంతవరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ వారు అనుమతి ఇవ్వలేదు. వీరు కొబ్బరికాయ కొడితే అయిపోతుందా? గత ప్రభుత్వం కూడా ఇలాగే చేసింది' అని విమర్శించారు.

'ఐదేళ్ల పాలనలో ఏం చేయగలమనే ప్రణాళిక లేకపోతే ఎలా?' అని సుజనా చౌదరి విమర్శలు గుప్పించారు. ఇది రాచరిక వ్యవస్థ కాదన్న విషయాన్ని రాష్ట్ర సర్కారు గుర్తు పెట్టుకుంటే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేయడం సరికాదని అన్నారు.

More Telugu News