Revanth Reddy: విజయారెడ్డిపై దాడి దారుణం.. దీని వెనుక నేతల ప్రోద్బలం ఉంది: రేవంత్ రెడ్డి ఆరోపణ

  • రెవెన్యూ అధికారులను దొంగలుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం
  • తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే రోజులొచ్చాయి
  • విజయారెడ్డి హత్య ఘటనపై సీబీఐ విచారణ జరపాలి 

అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ప్రోద్బలం వల్లే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దారు విజయారెడ్డిపై దాడి జరిగిందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఆమె భౌతికకాయానికి కొత్తపేటలో రేవంత్ నివాళులర్పించి, మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెవెన్యూ అధికారులను దొంగలుగా చిత్రీకరించేందుకు రాష్ట్ర సర్కారు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

మేజిస్ట్రేట్ అధికారాలున్న అధికారిణిపై దాడి చేయడం దారుణమన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే రోజులు వచ్చాయని విమర్శించారు. విజయారెడ్డి హత్య ఘటనపై సీబీఐ విచారణ జరపాలని, ఈ ఘటనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆమె మృతదేహానికి నివాళులర్పించేందుకు ఇప్పటి వరకు సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ రాకపోవడం బాధాకరమని రేవంత్ రెడ్డి అన్నారు.

More Telugu News