'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' విడుదల తేదీ ఖరారు

05-11-2019 Tue 13:07
  • తెరపైకి మరో హాస్యభరిత చిత్రం 
  • ఈ నెల 15వ తేదీన విడుదల 
  • సందీప్ కిషన్ జోడీగా హన్సిక
హాస్యరసభరితమైన కథలను తెరకెక్కించడంలో జి.నాగేశ్వరరెడ్డి సిద్ధహస్తుడు. 'సీమశాస్త్రి'.. 'సీమటపాకాయ్'.. 'దేనికైనా రెడీ' .. 'ఈడోరకం ఆడోరకం' చిత్రాలు ఆయన మార్కుతో ప్రేక్షకులను నాన్ స్టాప్ గా నవ్వించాయి. అలాంటి నాగేశ్వర రెడ్డి ఈ సారి కూడా పూర్తి వినోదభరితమైన కథనే తెరపై ఆవిష్కరించడానికి సిద్ధమయ్యాడు .. ఆ సినిమా పేరే 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'.

సందీప్ కిషన్ కథానాయకుడిగా రూపొందిన ఈ సినిమాలో ఆయన జోడీగా హన్సిక నటించింది. ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, తాజాగా ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. 'నిను వీడని నీడను నేనే' సినిమా ఫలితంతో ఊరట చెందిన సందీప్ కిషన్ కి, ఈ సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి.