rammohan naidu: చివరికి ప్రతిభా పురస్కారాల పేరు కూడా మార్చేశారు: చంద్రబాబు, లోకేశ్, రామ్మోహన్ విమర్శలు

  • అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం అవార్డు పేరు మార్పు
  • వైఎస్సార్ విద్యా పురస్కారాలుగా కొత్త పేరు సరికాదన్న టీడీపీ నేతలు
  • జీవో రద్దు చేయాలని డిమాండ్ 

పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే 'డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం' అవార్డుల పేరు మారింది. వైఎస్సార్ విద్యా పురస్కారాలుగా దీని పేరును మార్చుతూ  నిర్ణయం తీసుకున్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు.

'డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం' అవార్డుల పేరును వైఎస్సార్ విద్యా పురస్కారాలుగా మార్చడం విస్మయం కలిగిస్తోందని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. తన స్ఫూర్తివంతమైన జీవితంతో దేశానికి సేవలందించిన కలాంను అగౌరవపర్చేలా వైసీపీ ప్రభుత్వ తీరు ఉందని విమర్శలు గుప్పించారు.

విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు గతంలో చంద్రబాబు నాయుడు  ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారాలను ఇవ్వడం ప్రారంభించారని, కలాంను అవమానించేలా వైసీపీ ప్రభుత్వ తీరు ఉందని నారా లోకేశ్ అన్నారు. ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఎస్సెస్సీ పరీక్షలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఈ అవార్డులు ఇస్తారని, వీటిని రాజకీయాలకు అతీతంగా ఇవ్వాలని అబ్దుల్ కలాం పేరు పెట్టారని రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. వీటికి వైఎస్సార్ పేరు పెట్టడం సరికాదని అన్నారు. పేర్లను మార్చే తీరును కొనసాగిస్తోన్న ప్రభుత్వం ప్రతిభా అవార్డులను కూడా వదలలేదని విమర్శలు కురిపించారు.

More Telugu News