IYR Krishna Rao: అబ్దుల్ కలాం పురస్కారాల పేరును వైయస్సార్ పురస్కారాలుగా మార్చడం దురదృష్టకరం: ఐవైఆర్ కృష్ణారావు

  • వైయస్సార్ పేరుపై మరో కార్యక్రమాన్ని ప్రారంభించడం సబబు
  • విద్యాపరమైన పురస్కారాలకు కలాం పేరే సముచితంగా ఉంటుంది
  • అబ్దుల్ కలాం పురస్కారాల పేరు మార్పుపై ఐవైఆర్ అభ్యంతరం

ఇప్పటికే ఎన్నో పథకాల పేర్లను మార్చిన వైసీపీ ప్రభుత్వం... తాజాగా మరో పేరును మార్చడం కలకలం రేపుతోంది. భారత మాజీ రాష్ట్రపతి అబ్దు కలాం పేరిట ఇస్తున్న 'డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార్' అవార్డుల పేరును 'వైయస్సార్ విద్యా పురస్కారాలు'గా ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభను కనబరిచే విద్యార్థులకు ఈ పురస్కారాలను అందిస్తున్నారు.

మరోవైపు, అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార్ పేరు మార్పుపై ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. అబ్దుల్ కలాంగారి పేరుపై ఇస్తున్న ప్రతిభా పురస్కారాల పేరును వైయస్సార్ గారి పేరుతో మార్పు చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. వైయస్సార్ ను గౌరవించుకోవాలనుకుంటే వారి పేరుపైన కొత్తగా మరో కార్యక్రమాన్ని ప్రారంభించడం సబబని తెలిపారు. విద్యాపరమైన పురస్కారాలకు అబ్దుల్ కలాంగారి పేరే సముచితంగా ఉంటుందని అన్నారు.

More Telugu News