MRO Vijayareddy: నేడు తహసీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు.. భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన నేతలు

  • నాగోల్ శ్మశాన వాటికలో నేడు అంత్యక్రియలు
  • నిందితుడిని కఠినంగా శిక్షిస్తామన్న మంత్రి మహ్మద్ అలీ
  • దిగ్భ్రాంతికి గురయ్యానన్న మంత్రి పువ్వాడ

దుండగుడి చేతిలో సజీవ దహనమైన అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు నేడు నాగోల్ శ్మశాన వాటికలో జరగనున్నాయి. విజయారెడ్డిని నిన్న ఆమె కార్యాలయంలోనే గౌరెల్లి గ్రామానికి చెందిన దుండగుడు సురేశ్ కిరోసిన్ పోసి నిప్పు పెట్టాడు. అనంతరం తనపైనా కిరోసిన్ పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు.

ఈ ఘటనలో విజయారెడ్డి సజీవ దహనం కాగా, తీవ్ర గాయాలపాలైన నిందితుడు హయత్‌నగర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. విజయారెడ్డి హత్యపై పలువురు మంత్రులు, నేతలు స్పందించారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి మహ్మద్ అలీ.. నిందితుడు సురేశ్‌పై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ ఘటన తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని మరో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. నిందితుడిని ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని అన్నారు. ఇది ఒక వ్యక్తి చేసినట్టుగా అనిపించడం లేదని, వాస్తవాలను వెలికి తీసేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ డిమాండ్ చేశారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తదితరులు విజయారెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

More Telugu News