VH: రేపు అర్ధరాత్రిలోగా విధుల్లో చేరాలని కేసీఆర్ ఆదేశించడం అప్రజాస్వామికం: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్

  • రాజ్యాంగంపై అవగాహన లేదని విమర్శలు
  • ఆర్టీసీ ఆస్తులు తనవారికి కట్టబెట్టాలనుకుంటున్నారని ఆరోపణ
  • కేంద్రం కేసీఆర్ పై చర్యలు చేపట్టాలని డిమాండ్

తెలంగాణలో ఆర్టీసీ ఆస్తులను సీఎం కేసీఆర్ తన అనుయాయులకు కట్టబెట్టాలని చూస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. తమ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు రేపు అర్ధరాత్రి లోపు విధుల్లో చేరాలని హుకుం జారీచేయడం అప్రజాస్వామికమన్నారు. ఈరోజు వీహెచ్ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఏ చట్ట ప్రకారం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో మీరు సమ్మెలు చేశారని కేసీఆర్ ను నిలదీశారు.

రాజ్యాంగంపై అవగాహన లేని కేసీఆర్, అర్టీసీ సమ్మె చట్ట వ్యతిరేకమని అంటారా? అని మండిపడ్డారు. కేసీఆర్ ను న్యాయస్థానానికి పిలిచి ప్రశ్నించాలని పేర్కొన్నారు. కేసీఆర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. కేంద్రం తక్షణం జోక్యం చేసుకుని కేసీఆర్ పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

More Telugu News