rammohan naidu: ఈ విషయం మీద జగన్ మౌనం వీడి సమాధానం ఇవ్వాలి: ఎంపీ రామ్మోహన్ నాయుడు

  • కేంద్రం విడుదల చేసిన మ్యాపులో అమరావతికి దక్కని చోటు
  • అసలు మనకి రాజధాని ఉందా? అంటూ రామ్మోహన్ విమర్శ
  •  రాష్ట్రం ఎంత దిగజారిందో ఈ చిత్రపటమే చెబుతోంది
  • అమరావతిని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారా?

వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రతిష్ట ఎంతగా దిగజారిందో ఈ చిత్రపటమే చెబుతోందంటూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ట్విట్టర్ లో ఓ మ్యాపును పోస్ట్ చేశారు. భారతదేశానికి చెందిన ఈ నూతన చిత్ర పటాన్ని కేంద్ర హోంశాఖ తాజాగా విడుదల చేసింది. అయితే, ఈ చిత్ర పటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చోటు దక్కలేదంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని రామ్మోహన్ నాయుడు ప్రస్తావించారు.

'వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం ఎంత దిగజారిందో ఈ చిత్రపటమే చెబుతోంది. అసలు మనకి రాజధాని ఉందా? లేక అమరావతిని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారా? ఇప్పుడు చిత్రపటంలోనే కనపడలేదు, రేపు అసలు ఉంటుందో లేదో అన్న అనిశ్చితి నెలకొంది. ఈ విషయం మీద జగన్ మౌనం వీడి సమాధానం ఇవ్వాలి' అని రామ్మోహన్ నాయుడు విమర్శలు గుప్పించారు.

కాగా, జమ్మూకశ్మీర్ ఇటీవల రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన నూతన భారత రాజకీయ చిత్రపటాలను కేంద్ర హోం శాఖ విడుదల చేసింది.  దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిని సూచిస్తూ, వాటి పేర్లను ఎర్రటి అక్షరాల్లో ఇందులో పేర్కొన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాజధానిని గురించి పేర్కొనలేదు.

More Telugu News