Pawan Kalyan: అవన్నీ చూసిన తర్వాతే ప్రజలు జగన్ కి ఓట్లేశారు.. కొత్తగా మీరు చెప్పేదేంటి పవన్?: అంబటి రాంబాబు

  • జగన్ 16 నెలలు జైలులో ఉన్నారు
  • జగన్ పై అక్రమంగా కేసులు పెట్టారని ప్రజలు గుర్తించారు
  • చంద్రబాబు అజెండాను పవన్ మోస్తున్నారు
  • పవన్ స్పష్టమైన వైఖరితో ఉండాలి

టీడీపీ నేతలు అయ్యన్న పాత్రుడు, అచ్చెం నాయుడు స్క్రిప్టులు తీసుకొచ్చి ఇస్తే వాటిని చూసి జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నిన్న లాంగ్ మార్చ్ అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కి తెలుపుతున్నాను. జగన్ పై నేరారోపణ ఉంది. కోర్టుకి ప్రతి శుక్రవారం వెళుతున్నారు. 16 నెలలు జైలులో ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాతే  ప్రజలు 151 సీట్లు జగన్ కి దక్కేలా చేశారు' అని అన్నారు.

'ఇవన్నీ చూసిన తర్వాతే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ కు అవకాశం ఇచ్చారు. వైసీపీకి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. మీరు కొత్తగా కనిపెట్టిన విషయాలు కాదు ఇవి. జగన్ పై అక్రమంగా కేసులు పెట్టి వైఎస్సార్ కుటుంబాన్ని వేధించారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకొనే ఆయనకు ఓట్లు వేశారు. మళ్లీ కొత్తగా జగన్ శుక్రవారం కోర్టుకి వెళుతున్నారు.. పిటిషన్ లు దాఖలు చేశారు అంటూ మాట్లాడుతున్నారు' అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

'టీడీపీ చెప్పిన మాటలన్నీ పవన్ అనడం ఎందుకు? సూట్ కేసు కంపెనీలు పెట్టే విజయ సాయిరెడ్డి రాజ్యసభ ఎంపీగా ఉన్నారంటూ విమర్శలు చేయడం ఎందుకు? గౌరవ రాజ్యసభ సభ్యుడి గురించి ఇటువంటి విమర్శలు చేయడం సరికాదు. రాజకీయంగా వంద విమర్శలు చేసుకోండి ... వాటన్నింటికీ సమాధానం చెప్పే దమ్ము వైసీపీకి ఉంది' అని అంబటి రాంబాబు అన్నారు.

'ఓ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాను. చంద్రబాబు వయసు పెరిగిపోయింది. రాజకీయాల్లో ఆయన పని అయిపోయింది. ఆయనకు ఇప్పుడు ప్రజల్లో పలుకుబడి లేదు. ఆయన కుమారుడు లోకేశ్ ఇటీవల కేవలం 6 గంటలు నిరాహార దీక్ష చేశారు. ఇదో నిరాహార దీక్షా? చంద్రబాబు అజెండాను మోయడానికే పవన్ ప్రయత్నిస్తున్నారు. జనసేనకు ఓట్లు వేస్తే సైకిల్ కు ఓట్లు వేసినట్లేనని ప్రజలు భావించారు.. అందుకే జనసేన అభిమానులు కూడా వైసీపీకి ఓట్లు వేశారు' అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

'రాజకీయాల్లో మరొకరి సిద్ధాంతాలను మోయడానికి పని చేయకండి. కూలిపోయిన టీడీపీని మళ్లీ నిలబెట్టడానికే పవన్ పనిచేస్తున్నారు. ఢిల్లీ వెళ్లి విజయ సాయిరెడ్డి నాలుగు గోడల మధ్య ఏం చేస్తున్నారో తనకు తెలుసని పవన్ అంటున్నారు. ఇష్టానుసారం మాట్లాడొద్దు. బీజేపీతో నిత్యం మాట్లాడతానని పవన్ కల్యాణే అంటారు. మరోవైపు వామపక్ష పార్టీలతోనూ కలిసి పనిచేశారు. ఇదేనా మీ నైజం? స్పష్టమైన వైఖరితో ఉండండి' అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

More Telugu News