Crime News: ఉపాధికి సాయం చేస్తామంటూ వందమందిని ముంచేసిన మహిళ

  • రూ.300 చెల్లించి శిక్షణకు వస్తే కుట్టుమిషన్‌ ఫ్రీ అంటూ వల
  • యాభై మంది ఓ గ్రూపుగా ఏర్పడాలని కండిషన్‌
  • రెండు గ్రూపుల నుంచి డబ్బు తీసుకుని చేతులెత్తేసిన వైనం

ఉపాధికి ఆసరా కల్పిస్తామంటూ ఆశచూపి నిరుపేదల్ని మోసం చేసిందో మహిళ. కేవలం రూ.300 చెల్లించి తమవద్ద కుట్టు శిక్షణ పొందితే పూర్తయ్యాక మిషన్‌ ఉచితమని చెప్పి డబ్బులు దండుకున్నాక చేతులెత్తేసిందామె. దీంతో మోసపోయామని గుర్తించిన మహిళలు పోలీసులను ఆశ్రయించారు.

వివరాల్లోకి వెళితే... కడప జిల్లా రాయచోటికి చెందిన ఫరీదా అనే మహిళ 14 వారాల క్రితం చిత్తూరు జిల్లా మదనపల్లెకు వచ్చింది. తమ సంస్థ అందించే కుట్టు శిక్షణలో రూ.300 చెల్లించి చేరితే చివరిలో మిషన్‌ ఉచితంగా ఇస్తామని నమ్మబలికింది. ఇందుకు 50 మంది ఓ గ్రూపుగా ఏర్పడాలంది. కేవలం రూ.300కే శిక్షణతోపాటు మిషన్‌ వస్తుందన్న ఆశతో 102 మంది మహిళలు డబ్బు చెల్లించారు.

డబ్బు చెల్లించాక కడప నుంచి రమ్య, రమాదేవి అనే మహిళలు  శిక్షణ అందించేందుకు మదనపల్లెకు వచ్చేవారు. కానీ నెలలు గడుస్తున్నా వారు ఎటువంటి శిక్షణ అందించక పోవడంతో అనుమానం వచ్చిన మహిళలు నిలదీశారు. దీంతో తమకే కుట్టు పని రాదని, తామేం శిక్షణ ఇస్తామని చెప్పడంతో అవాక్కయ్యారు.

తాము ఫరీదా చెప్పే పని చేసేందుకే ఇక్కడకు వస్తున్నామని, ఒక్కొక్కరూ రూ.3,600 చెల్లిస్తేనే మిషన్‌ లు వస్తాయని వారు చెప్పారు. దీంతో ఆ ఇద్దరు మహిళలను పట్టుకుని బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించారు. ఫరీదాకు స్టేషన్‌ ఎస్‌ఐ ఫోన్‌చేస్తే స్విచ్ఛాఫ్‌ అని రావడంతో మోసం జరిగిందని నిర్థారణకు వచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News