Rajasthan: విమానంలో వెళ్లి నిందితుడిని పట్టుకున్న బెంగళూరు పోలీసులు!

  • పూజలు చేసేందుకు దుకాణానికి వెళ్లిన వ్యాపారి
  • ఇంట్లోని నగదు, నగలతో రైలెక్కిన నిందితుడు
  • అజ్మీర్‌ వెళ్తున్నట్టు గుర్తించి విమానంలో వెళ్లిన పోలీసులు

దొంగిలించిన సొత్తుతో రైలులో సొంతూరు బయలుదేరిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు విమానంలో వెళ్లారు. రైల్వే స్టేషన్‌లో కాపుకాసి అతడు రైలు దిగగానే పట్టుకున్నారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిందీ ఘటన. బెంగళూరు పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన మెహక్ వి.పిరగాల్ వస్త్రవ్యాపారి. రాజస్థాన్‌కు చెందిన కుశాల్‌సింగ్ (21) ను పనిలో పెట్టుకున్నారు. దీపావళి రోజున పూజలు చేసేందుకు పిరగాల్ దుకాణానికి వెళ్లగా, కుశాల్ ఒక్కడే ఇంటి వద్ద కాపలాగా ఉన్నాడు.

దీంతో దుర్బుద్ధి పుట్టిన నిందితుడు ఇంట్లోని నగలు, నగదు తీసుకుని పరారయ్యాడు. దుకాణంలో పూజలు చేసి ఇంటికొచ్చిన పిరగాల్.. కాపలాగా ఉండాల్సిన కుశాల్ కనిపించకపోవడం, ఇంట్లోని నగదు, నగలు మాయం కావడంతో ఇదంతా అతడి పనేనని అనుమానించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి ఫోన్ కాల్స్ ఆధారంగా అతడు అజ్మీర్ వెళ్తున్నట్టు గుర్తించారు. మూడు రోజుల ప్రయాణం అనంతరం కుశాల్ అజ్మీర్ స్టేషన్‌లో దిగాడు. అప్పటికే విమానంలో అజ్మీర్ చేరుకుని రైల్వే స్టేషన్‌లో కాపుకాసిన బెంగళూరు పోలీసులు నిందితుడిని పట్టుకుని అరదండాలు వేశారు. బెంగళూరు తీసుకొచ్చి కటకటాల వెనక్కి పంపారు.

More Telugu News