Telangana: ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆర్థికశాఖనూ ప్రైవేటు పరం చేయండి: విజయశాంతి

  • కేసీఆర్ నిర్ణయం దొరల నిరంకుశత్వానికి నిదర్శనం
  • మీకు వర్తించని సూత్రాలు ఆర్టీసీకి ఎలా వర్తిస్తాయి?
  • అప్పుల్లో తెలంగాణ రాష్ట్రం

ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడం తప్పదని పదేపదే చెబుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి ఘాటు కౌంటర్ ఇచ్చారు. నష్టాల్లో ఉన్నందుకు ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేటట్టు అయితే, ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆర్థిక శాఖను కూడా ప్రైవేటు పరం చేయాలని సూచించారు. తెలంగాణ ప్రజలందరూ ఇదే మాట అనుకుంటున్నారని అన్నారు.

 మీకు వర్తించని ఆర్థిక సూత్రాలు ఆర్టీసీకి మాత్రమే వర్తించాలని అనుకోవడం దొరల నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసేసుకున్నారని, తన కుట్రను కప్పిపుచ్చుకునేందుకు కొత్త నాటకం మొదలుపెట్టారని విజయశాంతి మండిపడ్డారు.

కేసీఆర్ చెబుతున్న ఆర్థిక క్రమశిక్షణ తెలంగాణ ప్రభుత్వానికి కూడా వర్తిస్తుందన్న విజయశాంతి.. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. మిగులు బడ్జెట్‌తో మొదలైన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు నిండా అప్పుల్లో మునిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News