Narendra Modi: ప్రధాని మోదీ నివాసంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించిన ఎస్పీ బాలు

  • ప్రధాని నివాసంలో సినీ తారలతో సమావేశం
  • ఎస్పీ బాలుకు కూడా ఆహ్వానం
  • బాలు సెల్ ఫోన్ తీసేసుకున్న ప్రధాని భద్రతాసిబ్బంది

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సినీ ప్రముఖులతో మోదీ సమావేశమయ్యారు. అధికంగా బాలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానాలు పంపారని విమర్శలు కూడా వచ్చాయి. ఈ కార్యక్రమానికి దక్షిణాది నుంచి కూడా చాలా పరిమిత సంఖ్యలో సెలబ్రిటీలు వెళ్లారు. వారిలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు. ప్రధాని నివాసంలో తనకు ఎదురైన అవమానకర సంఘటన గురించి ఫేస్ బుక్ లో పోస్టు చేస్తేనే ఆయన కూడా ప్రధాని ఇంట కార్యక్రమానికి వెళ్లాడన్న సంగతి తెలిసింది. ఇంతకీ బాలుకు ఎదురైన చేదు అనుభవం ఏంటంటే...

ఈ కార్యక్రమం కోసం ఢిల్లీ వెళ్లిన ఎస్పీ బాలు ప్రధాని నివాసానికి చేరుకున్నారు. అక్కడ గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది బాలు, ఇతర సినీ టెక్నీషియన్ల నుంచి ఫోన్లను తీసుకున్నారు. వారికి కొన్ని టోకెన్లు ఇచ్చి లోపలికి పంపారు. భద్రతా విధుల్లో ఇదీ ఓ భాగమేనని బాలు సర్దిచెప్పుకున్నారు. కానీ, లోపలికి వెళ్లాక కొందరు స్టార్ హీరోలు, బాలీవుడ్ ప్రముఖులు మాత్రం చేతిలో ఫోన్లు పట్టుకుని ప్రధాని మోదీతో సెల్ఫీలు దిగుతూ కనిపించేసరికి బాలుకు తాము ఎంత అవమానానికి గురయ్యామో అర్థమైంది.

ఇదే విషయాన్ని ఫేస్ బుక్ లో అందరికీ వివరించారు. ప్రధాని మోదీ ఇంట జరిగిన ఆ కార్యక్రమానికి ఈనాడు అధినేత రామోజీరావు వల్లే వెళ్లగలిగానని, కానీ అక్కడ జరిగిన పరిణామాలు ఎంతో బాధ కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News