KK Modi: మోదీ ఎంటర్ ప్రైజెస్ అధినేత కేకే మోదీ కన్నుమూత

  • శనివారం తుదిశ్వాస విడిచిన వ్యాపారదిగ్గజం
  • ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ తండ్రే కేకే మోదీ
  • భారత్ లో దిగ్గజ వ్యాపార కుటుంబాల్లో ఒకటిగా మోదీ కుటుంబానికి పేరు

మోదీ కేర్, గాడ్ ఫ్రే ఫిలిప్స్, ఇండోఫిల్ ఇండస్ట్రీస్ సంస్థలతో కూడిన మోదీ ఎంటర్ ప్రైజెస్ వ్యాపార సామ్రాజ్య అధినేత కేకే మోదీ కన్నుమూశారు. ఆయన పూర్తిపేరు కృష్ణకుమార్ మోదీ. కేకే మోదీ పెద్ద కుమారుడు ఎవరో కాదు, ఐపీఎల్ కు ఆద్యుడిగా పేరొందిన లలిత్ మోదీ. ఇక, కేకే మోదీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ ఆయన శనివారం ఉదయం మరణించారు. ఆయన వయసు 79 సంవత్సరాలు.

మోదీల కుటుంబం భారత్ లో ఎంతోకాలంగా వ్యాపార రంగంలో ఉన్న కుటుంబాల్లో ఒకటిగా ప్రసిద్ధికెక్కింది. కేకే మోదీ తండ్రి రాయ్ బహదూర్ గుజర్మాల్ మోదీ అప్పట్లోనే పేరుమోసిన వ్యాపారవేత్తగా ఖ్యాతి గడించారు. 1940లో జన్మించిన కేకే మోదీ అనతికాలంలోనే తండ్రి వారసత్వాన్ని అందుకుని మోదీ ఎంటర్ ప్రైజెస్ పేరిట వ్యాపారాన్ని విస్తరించారు. సిగరెట్లు (గాడ్ ఫ్రే ఫిలిప్స్), పురుగుమందులు, ఎరువులు (ఇండోఫిల్), ఆరోగ్య, సౌందర్య ఉత్పత్తులు (మోదీ కేర్) తదితర వ్యాపారాల్లో రాణించారు.

కాగా, తండ్రి మరణంపై లలిత్ మోదీ ట్విట్టర్ లో స్పందించారు. 'లవ్యూ డాడ్' అంటూ భావోద్వేగాలకు గురయ్యారు. ఐపీఎల్ ఆర్థిక అవకతవకలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నట్టు సమాచారం.

More Telugu News