Hyderabad: మత్తు పదార్థాల విక్రయాలకు వసతి గృహాలే అడ్డా

  • గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థులకు విక్రయం
  • నిఘా పెట్టిన పోలీసులు
  • గంజాయితోపాటు వ్యక్తి అరెస్టు

హైదరాబాద్‌ నగరంలోని అమీర్‌పేట, ఎస్సార్‌నగర్‌ ప్రాంతాల్లోని ప్రైవేటు హాస్టల్స్‌ అతని అడ్డా. అక్కడ ఆశ్రయం ఉంటున్న విద్యార్థులకు గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సరఫరా చేస్తూ తన వ్యాపారాన్ని మూడుపువ్వులు ఆరు కాయలుగా నడుపుతున్నాడో వ్యక్తి. ఈ అమ్మకాలపై ఉప్పందడంతో నిఘా పెట్టిన పోలీసులు గుట్టు రట్టు చేశారు. వివరాల్లోకి వెళితే... ఖమ్మం జిల్లా ఏన్కూరుకు చెందిన నంద్యాల అరవింద్‌ ఉపాధి వెతుక్కుంటూ నగరానికి వచ్చాడు.

వేగంగా డబ్బు సంపాదించేందుకు అతని దృష్టి మత్తు పదార్థాల విక్రయంపై పడింది. దీంతో హాస్టల్స్‌ను తన అడ్డాగా మార్చుకున్నాడు.విద్యార్థులతో పరిచయాలు పెంచుకుని గుట్టుచప్పుడు కాకుండా గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాన్ని గత కొన్నాళ్లుగా కొనసాగిస్తూ వచ్చాడు.

దీనిపై కచ్చితమైన సమాచారం అందడంతో నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు నిన్న అమీర్‌పేటలోని సారథీ స్టూడియోస్‌ సమీపంలో అరవింద్‌ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి రూ.లక్ష విలువ చేసే కేజీ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అరవింద్‌కు మంగళహాట్‌కు చెందిన కిషోర్‌సింగ్‌ అనే వ్యక్తి గంజాయి సరఫరా చేస్తుంటాడని తేలడంతో అతని కోసం గాలిస్తున్నారు.

More Telugu News