Thailand: థాయ్ లాండ్ గడ్డపై అడుగుపెట్టిన ప్రధాని మోదీ.. ఘనస్వాగతం!

  • మూడురోజుల పాటు ప్రధాని టూర్
  • రేపు థాయ్ ప్రధాని ప్రయుత్ ఛాన్ తో భేటీ
  • 16వ ఆసియాన్- ఇండియా సదస్సులో ప్రసంగం

భారత ప్రధాని నరేంద్ర మోదీ థాయ్ లాండ్ లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆ దేశ రాజధాని బ్యాంకాక్ కు చేరుకున్నారు.  భారతీయ సంతతికి చెందిన ప్రజలు భారీ సంఖ్యలో మోదీకి స్వాగతం చెప్పారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ‘ థాయ్ లాండ్ లో నా తొలి అధికారిక పర్యటన ఇది. ఇక్కడికి రాగానే నాకు విదేశంలో ఉన్న భావనే కలగలేదు’ అని అన్నారు.

థాయ్ లాండ్ లో మోదీ పర్యటన వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గురునానక్ 550వ జయంతి సందర్భంగా అక్కడ ఏర్పాటుచేస్తున్న కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారని పేర్కొంది. భారత్, థాయ్ లాండ్ దేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేసే నేపథ్యంలో ఆతిథ్య దేశంతో ఒప్పందాలు కుదుర్చుకుంటారని తెలిపింది. ఇరుదేశాల మధ్య ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం(ఆర్ సీఈపీ) పై చర్చలు కొనసాగిస్తారని వెల్లడించింది.

రేపు థాయ్ లాండ్ ప్రధాని ప్రయుత్ ఛాన్ తో మోదీ భేటీ కానున్నారని, అనంతరం 16వ ఆసియాన్- ఇండియా సదస్సు, 14వ ఈస్ట్ ఏసియా సదస్సులో మోదీ పాల్గొననున్నారని తెలిపింది.  ఇవేకాక  సోమవారం బ్యాంకాక్ లో జరిగే ఆసియా పసిఫిక్ దేశాల సదస్సులో ఆయన పాల్గొనున్నట్లు తెలుస్తోంది.

More Telugu News